– సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు జె.కుమారస్వామి
– డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత
– కార్మిక శాఖ ఎదుట నిరసన
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలో 73వ షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌కు సంబంధించిన కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు జె.కుమారస్వామి డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2021లో కనీస వేతనాలను సవరిస్తూ 5 ప్రిలిమినరీ జీవోలను విడుదల చేసిందని, కానీ యాజమాన్యాల ఒత్తిడితో ఆ జీవోలను గెజిట్ చేయకుండా అలాగే తొక్కి పెట్టి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. చట్టం ప్రకారం కనీస వేతనాల జీవోలను ఐదేండ్లకోసారి సవరించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అనేక జీవోలు 15 ఏండ్లుగా ఎలాంటి సవరణకూ నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆ షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో పనిచేసే కార్మికులకు 15 ఏండ్ల కిందట నిర్ణయించిన వేతనాలనే ఇప్పటికీ ఇస్తున్నారని తెలిపారు. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా.. వేతనాల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం మూలంగా కార్మికవర్గం అనేక ఇబ్బందులకు గురవుతున్నదన్నారు. కనీసం వేతనాల సలహా మండలి ఇచ్చిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకోకుండా కాలయాపనక చేస్తున్నాయన్నారు. 2021లో విడుదల చేసిన షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ 5 ప్రిలిమినరీ జీవోలకు యథాతథంగా గెజిట్ విడుదల చేయాలని, మిగిలిన 68 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాల జీవోలను సవరించి కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల సవరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జీవోలను వెంటనే సవరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం నాయకులు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జాసన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఉపాధ్యక్షులు ఆర్.అశోక్, జి.రాములు, టి.మహేందర్, సి.మల్లేష్, డీఎల్ మోహన్, జిల్లా కమిటీ సభ్యులు జగదీష్, ఏ.రాజు, నాయకులు కె.జంగయ్య, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నాయకులు రాజు, హెచ్‌ఎండీఏ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జి.సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనాల జీవోలు సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES