నవతెలంగాణ – హైదరాబాద్: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నిమిష ప్రియను భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె విడుదలను కోరుతూ కుటుంబ సభ్యులు యెమెన్‌కు వెళ్లారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ఇందుకు సంబంధించి ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. నిమిష ప్రియను విడిచిపెట్టాలని కోరుతూ ఆమె భర్త థామస్, కుమార్తె మిషెల్ అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.
వారితో పాటు కేఏ పాల్, ఇతరులు ఉన్నారు. తన భార్య మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినందుకు థామస్ అక్కడి హుతీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోలో కేఏ పాల్ మాట్లాడుతూ, ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైనదని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో అతలాకుతలమైన యెమెన్‌లో శాశ్వత శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నిమిష ప్రియను విడుదల చేయాలని ఆయన అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.