Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంమైనర్ షూటర్‌పై అఘాయిత్యం..కోచ్‌పై పోక్సో చట్టం కింద కేసు

మైనర్ షూటర్‌పై అఘాయిత్యం..కోచ్‌పై పోక్సో చట్టం కింద కేసు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ స్థాయి షూటింగ్ క్రీడలో తీవ్ర కలకలం రేగింది. 17 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో జాతీయ పిస్టల్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అతడిని తక్షణమే అన్ని బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం, న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో అథ్లెట్ పనితీరును విశ్లేషిస్తానని చెప్పి, భరద్వాజ్ ఆమెను తన గదికి పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని, కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుతో ఫరీదాబాద్ ఎన్‌ఐటీలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. “కేసు తీవ్రత దృష్ట్యా, హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే అందించాలని యాజమాన్యాన్ని కోరాం. ఆరోపణలను నిర్ధారించుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాం” అని ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్‌పాల్ యాదవ్ తెలిపారు.

ఈ విషయం మీడియా ద్వారా తెలిసిందని, విచారణ పూర్తయ్యే వరకు కోచ్ అంకుశ్‌ను సస్పెండ్ చేస్తున్నామని, అతనికి ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించబోమని ఎన్‌ఆర్‌ఏఐ సెక్రటరీ జనరల్ పవన్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే కోచ్ నుంచి మరో మహిళా షూటర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -