నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి: తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విరాళం అందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్మారెడ్డి కలిసి రూ.2కోట్ల చెక్ అందజేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు.
ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్‌ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.