నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. సుచాత గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు.. థాయ్ లాండ్ లోని ఫుకెట్ లో సుచాత జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తానెట్ డోంక్‌మనెర్డ్, సుపత్రా చువాంగ్ శ్రీ. చువాంగ్ శ్రీ కుటుంబానికి థాలాంగ్‌లో వ్యాపారం ఉంది. ప్రాథమిక విద్యాభ్యాసం ఫుకెట్ లోనే పూర్తిచేసిన సుచాత.. బ్యాంకాక్ లో ఉన్నత విద్య పూర్తిచేశారు. ప్రస్తుతం బ్యాంకాక్ లోని థమ్మసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారు.
ఓపల్ సుచాతా బ్రెస్ట్ ట్యూమర్‌ను జయించారు. 16 ఏళ్ల వయసులో తన రొమ్ములో కణితిని గుర్తించగా, సకాలంలో చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. ఆ సమయంలో తన శారీరక, మానసిక అవస్థ వర్ణనాతీతమని సుచాత చెప్పారు. మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని గుర్తించి, ‘పాల్ ఫర్ హర్’ పేరుతో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మానసిక శాస్త్రం, ఆంత్రోపాలజీపై ఆసక్తి కలిగిన ఓపల్, యువతులలో విద్యను ప్రోత్సహించడానికి కూడా కృషి చేస్తున్నారు. సుచాత జంతుప్రేమికురాలు.. తన ఇంట్లో 16 పిల్లులు, ఐదు కుక్కలను ఆమె పెంచుకుంటున్నారు.