– కాంగ్రెస్ పై ప్రజల నమ్మకమే విజయానికి మూలం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజల తీర్పు మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిందని, కాంగ్రెస్ పై వారి నమ్మకమే అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీ వేదికపై ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణస్వీకారం చేయడానికి కారణం అయిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేసారు. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే ఆదినారాయణ నవీన్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం ఏ ఒక్కరికి కాదని,ఇది కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వారి మధ్యకు వెళ్లి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుని,పరిష్కారం చూపేందుకు చేసిన ప్రయత్నాలకు ఈ ఎన్నిక ప్రతిఫలం దొరికిందని పేర్కొన్నారు.నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ప్రజల్లో ఏర్పరచుకున్న అనుబంధం, ఆయన సేవా ధోరణి కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.
“జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారిపై పెట్టుకున్న నమ్మకం అమోఘం అని ఆయనకు వచ్చిన ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ శక్తి మరింత పెరిగిందని అన్నారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం మా మొదటి కర్తవ్యం అని,నవీన్ యాదవ్ శాసన సభ్యుడిగా ప్రజలకు మరింత చేరువై అభివృద్ధి పనులను వేగవంతం చేస్తారని నాకెంతో నమ్మకం ఉంది” అని ఎమ్మెల్యే ఆదినారాయణ ఆశాభావం వ్యక్తం చేసారు.
నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారం సందర్భంగా అక్కడి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జెండాలు ఊపుతూ, డప్పులు మోగించి, విజయోత్సవాన్ని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు రాష్ట్ర రాజకీయ వాతావరణానికి కొత్త సందేశం ఇస్తోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజల ఆశల్ని నెరవేర్చేందుకు మరింత బలంగా పనిచేస్తుందని నాయకులు నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ విజయంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పథం వేగవంతం కానుందని, ప్రజల సహకారంతో కాంగ్రెస్ మరిన్ని విజయాలు సాధించే దిశగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.



