Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంఓట్ల చోరీ వల్లే ప్రధానిగా మోడీ

ఓట్ల చోరీ వల్లే ప్రధానిగా మోడీ

- Advertisement -

హర్యానాలో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ
రాజ్యాంగంపై దాడి : రాహుల్‌ గాంధీ విమర్శలు
ఎన్నికలను దొంగిలించడానికి బీజేపీ, ఈసీ కుట్ర

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఎన్నికలను బీజేపీ దొంగతనం చేస్తోందని, ఓట్లు చోరీ చేయడంతోనే మోడీ ప్రధాని అయ్యారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎన్నికలను ఎలా దొంగిలిస్తుందనే విషయాన్ని దేశ యువతకు, ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఆధారాలతో చూపిస్తుందని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటివరకు బీజేపీ, ఈసీ స్పందించలేదని చెప్పారు. ఓట్ల చోరీపై తమ దగ్గర చాలా సమాచారం ఉందని స్పష్టం చేశారు. హర్యానాలో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. బీహార్‌లో కూడా ఇదే ఘటన పునరావృతం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, గుజరాత్‌లోనూ ఇదే జరిగిందని వివరించారు. ఓట్ల చోరీపై బీజేపీ ఆత్మరక్షణలో పడిందే తప్ప వ్యతిరేకించటంలేదని చెప్పారు. బీజేపీ, ఈసీ రెండూ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల దొంగతనం వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. తమ వద్ద చాలా సమాచారం ఉందనీ, తాము ఈ ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. ఓట్ల చోరీతోనే మోడీ ప్రధాని అయ్యారన్న విషయాన్ని తాము స్పష్టంగా చెబుతామని, అందులో ఎటువంటి సందేహమూ లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ యత్నం
బీహార్‌లోని బంకాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ నాయకులు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో కూడా ఓటు వేశారని ఆయన ఆరోపించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ”ఓటు చోరీ” (ఓటు దొంగతనం)కు సంబంధించిన ఆధారాలను సమర్పించిందనీ, ఈసీ ఆ ఆరోపణలను తిరస్కరించలేదని అన్నారు. ”హర్యానాలోని రెండు కోట్ల మంది ఓటర్లలో 29 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాల్లో బీజేపీ ‘ఓటు చోరీ’లో మునిగిపోయింది. ఇప్పుడు వారు బీహార్‌లో కూడా దానిని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బీహార్‌ ప్రజలు తమ రాష్ట్రంలో ఇది జరగడానికి అనుమతించరని నాకు కచ్చితంగా తెలుసు” అని ఆయన నొక్కి చెప్పారు. ప్రధాన సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు సోషల్‌ మీడియా రీల్స్‌ చేయడానికి యువతను ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాహుల్‌ విమర్శించారు. రీల్స్‌ 21వ శతాబ్దపు వ్యసనం అని ఆయన అన్నారు.

మీడియాను నియంత్రిస్తున్న బీజేపీ
భాగల్పూర్‌లో జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీహార్‌లోని రైతులు, కార్మికులు, నేత కార్మికులకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదని, వారి రుణం మాఫీ కావడం లేదని విమర్శించారు. అయితే, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్లప్పుడూ కొన్ని కార్పొరేట్‌ సంస్థల రుణాలను మాఫీ చేస్తుందని ఆరోపించారు. ప్రధాని ముఖాన్ని 24 గంటలు చూపించడానికి టీవీ ఛానెళ్లకు బీజేపీ డబ్బు చెల్లిస్తుందని ఆయన అన్నారు. ”మీడియాను బీజేపీ నియంత్రిస్తోంది. మనం ఏమి చెప్పినా, మీరు దానిని సోషల్‌ మీడియాలో చూడవచ్చు. కానీ టీవీ ఛానెళ్లలో కాదు. మోడీ, అమిత్‌ షా, ఈసీ హర్యానా ఎన్నికలను దొంగిలించారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయి. హర్యానా ప్రభుత్వం ‘చోరీ కి సర్కార్‌’ (దొంగతనంతో ఏర్పడిన ప్రభుత్వం) అని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను. ఇది ఆపరేషన్‌ సర్కార్‌ చోరీ. ఒక బ్రెజిల్‌ మోడల్‌ ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఎన్నికల సంఘం ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఒకే ఇంట్లో 501 మంది ఓటర్లు ఉన్నట్టు చూపినా గుర్తించలేకపోయింది? బీహార్‌లోనూ ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం లేకపోలేదు” అని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -