‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’, అంటూ ఇటుకల పొయ్యితో నిరసన
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళన
గ్యాస్ సమస్యను త్వరగా పరిష్కరించాలి
కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి
సిలిండర్ల కొరతపై ఆగ్రహం
సీఈసీ అభిశంసన తీర్మానంపై 193 మంది ఎంపీల సంతకాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. దేశంలో చమురు కొరతపై ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’, ‘మోడీ జీ, ఎల్పీజీ’ అంటూ ఇటుకలతో ఏర్పాటు చేసిన వంట పొయ్యిల తోనూ వంట స్టవ్ వద్ద కూర్చుని నినాదాల హోరెత్తించారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సమస్య సంక్షోభంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని అన్నారు ”దేశంలో చమురు కొరతపై కేంద్రం త్వరగా స్పందించాలి. సంక్షోభం గా మారకముందే మేల్కోవాలి. కేంద్ర విదేశాంగ విధానం మారాలి. దేశంలో గ్యాస్ ఒక ప్రాబ్లం. చమురు ఒక ప్రాబ్లం. పెట్రోల్ ఒక సమస్య.
ఎందుకంటే మనం ఇంధన భద్రతలో రాజీపడ్డాం. లోపాలతో కూడిన విదేశాంగ విధానమే ఇందుకు కారణం. చమురు సమస్యపై ముందు జాగ్రత్త అవసరం. ప్రధాన మంత్రి, ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించాలి. ప్రజలపై భారం పడకుండా చూడాలి. నేను ఇలాంటి అంశాలపై మాట్లాడటానికి ఒక విధానం ఉంటుంది. ఎల్పీజీ, గ్యాస్, ఆయిల్ సమస్యపై నేను మాట్లాడాలి. కానీ, ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కొత్త విధానం తీసుకొచ్చారు. ముందుగా దీనిపై మంత్రి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత నేను మాట్లాడుతా. ఆ తర్వాత మంత్రి సమాధానం ఇస్తారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి” అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
సీఈసీ అభిశంసన తీర్మానంపై 193 మంది ఎంపీలు సంతకాలు
దేశ చరిత్రలోనే తొలిసారి ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తొలగించాలని కోరుతూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాయి. ఈ నోటీస్‌పై ఇప్పటికే 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అందులో 130 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపు నోటీస్‌పై ఎంపీలు ఉత్సాహంగా సంతకాలు చేస్తున్నారని, ఇప్పటికే నోటీస్ ఇచ్చేందుకు అవసరమైన ఎంపీల సంఖ్య పూర్తయ్యిందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ గురువారం చెప్పినట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ నిబంధనల ప్రకారం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపు కోరుతూ నోటీస్ ఇవ్వాలంటే ఆ నోటీస్‌పై కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు, కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ సంఖ్య ఇప్పటికే దాటినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పార్టీలకు చెందిన ఎంపీలు ఈ నోటీస్‌పై సంతకాలు చేసినట్లు సమాచారం. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధికార బీజేపీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయన తొలగింపును కోరుతూ ఎంపీలు నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సభ నియమ నిబంధనలకు ఎవరూ అతీతులుకారు
ప్రతిపక్షాలు తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తాను ఎల్లప్పుడూ ప్రతి ఎంపీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. సభ నియమ నిబంధనలకు ఎవరూ అతీతులుకారని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయ్యేవరకు సభకు దూరంగా ఉన్న స్పీకర్.. తీర్మానం వీగిపోగానే మళ్లీ యథావిధిగా విధులకు హాజరయ్యారు.
అమెరికాతో మోడీ ప్రభుత్వం రాజీ: రాహుల్ గాంధీ
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. గురువారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. ఇంధన భద్రత విషయంలో అమెరికాతో మోడీ ప్రభుత్వం రాజీపడిందని విమర్శించారు. ఈ రాజీతో వివిధ చమురు సరఫరాదారులతో తన సంబంధాలను నిర్ణయించే అధికారాన్ని అమెరికాకు కట్టబెట్టినట్టు అయ్యిందని ఆయన మండిపడ్డారు.
ఎప్‌స్టీన్ అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన… సభ వాయిదా
గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. దేశానికి పునాది ఇంధన భద్రత అని అభివర్ణించారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని మండి పడ్డారు. రష్యా ఆయిల్‌ను కొనడానికి ఎవరి అనుమతి కావాలి? అంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. యూఎస్ అనుమతి లేకుంటే ముడి చమురు కొనుగోలు చేయ్యారా? అంటూ వ్యంగ్యం గా కేంద్రాన్ని నిలదీశారు.
గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. పెట్రోలియం మంత్రికి ఎప్‌స్టీన్‌తో సంబం ధాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే రాహుల్ మైక్‌ను స్పీకర్ ఓం బిర్లా కట్ చేశారు. అంతలో సభలోని హర్దీప్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్దీప్‌సింగ్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. అంతే కాకుండా ఎప్‌స్టీన్ అంటూ సభలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
దేశంలో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వివరించారు. సిలిండర్ల సరఫరాలో ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సిలిండర్ బుకింగ్‌కు నగరాల్లో 25 రోజుల వ్యవధి, గ్రామాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేస్తున్నట్టు చెప్పారు.



