Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధికి ఉరేస్తున్న మోడీ సర్కార్‌

ఉపాధికి ఉరేస్తున్న మోడీ సర్కార్‌

- Advertisement -

– కేవైసీ పేరుతో 27 లక్షల మంది కూలీలను తొలగించిన ప్రభుత్వం : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మోడీ సర్కార్‌ ఉరేస్తున్నది. కేవైసీ డిజిటలైజేషన్‌ పేరుతో 27 లక్షల మంది కూలీలను తొలగించి వారి పొట్టగొట్టింది. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. ఆ చట్టాన్ని కాపాడుకునేందుకు గ్రామాల్లో ఉద్యమాన్ని చేపట్టాల’ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్‌ ఆర్‌ వెంకట్‌ రాములు పిలుపునిచ్చారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ మౌలిక చట్టానికి కొర్రీలు పెడుతూ కూలీలకు 100 రోజుల పని కల్పించాల్సిన బాధ్యతనుండి తప్పుకోచూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్‌ మొబైల్‌ మోనిటరింగ్‌ విధానాన్ని తీసుకొచ్చి ఆధార్‌ కార్డు, ఉపాధి జాబ్‌ కార్డు, బ్యాంకు అకౌంటు లింకుతో పేర్లు సరిగా లేవని 7.8 లక్షల జాబు కార్డులను తొలగించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులను క్లబ్‌ పేరుతో మూసేశారని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డులు చాలామందికి జనరేట్‌ కాలేదని తెలిపారు. వచ్చిన కార్డులలో పేర్లు తప్పులు సరి చేసుకోడానికి ఆధార్‌ సెంటర్లు అందుబాటులో లేవని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పని స్థలాల్లో రెండుసార్లు ఫోటోలు, ఉదయం, సాయంత్రం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని నిబంధన తెచ్చిందని తెలిపారు. వాస్తవంగా అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యమే లేదని పేర్కొన్నారు. ఉపాధి సిబ్బందికి కంప్యూటర్‌ నెట్‌ సౌకర్యం వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని గుర్తు చేశారు. దీంతో పని కోసం వచ్చిన కూలీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవటం వల్ల కూలీలు పనికి రావటం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చేసిన పనికి వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని చట్టం చెప్తుంటే సంవత్సరాల తరబడి వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా రూ.30, 50 లోపు మాత్రమే పడుతున్నాయని తెలిపారు. ఫలితంగా ఉపాధి పనికి పోతే వేతనాలు పడవు, రావనే ఒక అభద్రతాభావం ప్రజల్లో పెరిగింని గుర్తు చేశారు. పనులను పరిశీలన చేయడానికి డ్రోన్‌ యంత్రాలను ప్రభుత్వం తీసుకొచ్చిందనీ, వాటి సాయంతో ఫొటోలు తీస్తూనే మరొకవైపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పటం తగదని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంఎత్తేయాలని చూస్తున్నదనీ, అది సాధ్యం కాకపోవడంతో దొడ్డి దారిన బలహీనపరిచే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వందరోజుల పనిని కల్పించాలనే నిబంధనను నీరుగార్చేందుకు దొడ్డిదారిన ప్రభుత్వం కొత్త నిబంధనలను ముందుకు తెస్తున్నదని విమర్శించారు. నిధుల కేటాయింపులో కోత విధించిందనీ, గ్రామీణ పేదలు రైతాంగానికి ఉపయోగపడే పనులను ఎంపిక చేయకుండా ఎత్తివేసిందని ఆరోపించారు. వ్యవసాయ పొలాల అభివృద్ధి పనులను వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధికి ఉపయోగపడే పనులను తీసివేసిందని తెలిపారు. అభివృద్ధి పేరుతో అనేక గ్రామాలను పట్టణాల్లో కలిపి పనిని తీసేసిందని పేర్కొన్నారు. తక్షణమే ఈ ఆలోచన నుండి ప్రభుత్వం వెనక్కి రావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కూలి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -