Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅదానీ, అంబానీ కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది

అదానీ, అంబానీ కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది

- Advertisement -

– రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌
– సంగారెడ్డి జిల్లా అందోల్‌ నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర
నవతెలంగాణ-జోగిపేట

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసమే పని చేస్తున్నదని ీ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర శుక్రవారం రెండవ రోజు సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని అందోల్‌ నియోజకవర్గం సంగుపేట చౌరస్తా నుంచి జోగిపేట వరకు పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌, జి.వివేక్‌ వెంకటస్వామితో కలిసి ఆమె పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. బీహార్‌లో పేదల ఓట్లు తొలగిస్తున్నారని, వారు ఓటు హక్కు వినియోగించుకోవద్దా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో రెండు రకాల మోడల్స్‌ ఉన్నాయని, ఒకటి తెలంగాణ మోడల్‌, రెండోది విద్వేష మోడల్‌ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనతో అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్టు చెప్పారు. సామాజిక న్యాయం దిశగా పని చేస్తోందని, ఇది రాహుల్‌గాంధీ మోడల్‌ అని తెలిపారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 100 సీట్లు కచ్చితంగా గెలుస్తామన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన మీనాక్షి గాంధీ మనకు అండగా ఉన్నారని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. జోగిపేట ఉద్యమాలకు అడ్డ అని అన్నారు. సింగూరు జలాలు, జేఎన్‌టీయూ, విద్య, వైద్య సదుపాయాల కల్పనలో అందోల్‌ నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటాలన్నారు. మంత్రి జి వివేక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తోందన్నారు. గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతోనే ఈ పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్‌ షట్కార్‌, మాజీ ఎమ్మెల్యే,పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీబీ చైర్మెన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -