– అమెరికా ఆంక్షలకు జీ హుజూర్
– కనీస వేతనాలు పట్టని ప్రభుత్వాలు
– దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాలే పరిష్కారం : సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటు : చైర్మెన్‌గా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా ఎ.మల్లేశం
– మహాసభకు వేతన జీవులు భారీగా విరాళాలు అందజేత
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
”అమెరికా అధ్యక్షులు ట్రంప్ పెడుతున్న ఆంక్షలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని జీ హుజూర్ అంటున్న ప్రధాని మోడీ సామ్రాజ్యవాదానికి అతి పెద్ద బానిస. ట్రంప్, మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు భారత ప్రజలకు ప్రమాదఘంటికలుగా మారుతు న్నాయి. కార్మికవర్గాన్ని బానిసల్ని చేయడం కోసమే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్లతోపాటు విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తలూపుతూ.. లేబర్ కోడ్‌లను అమలు చేస్తూ.. 10 గంటల దినంగా పెంచుతూ జీవోలు జారీ చేస్తున్నాయి. బీజేపీ మతాన్ని తన మంత్ర తంత్రంగా వాడుతూ ప్రజలు, కార్మికుల్ని సంఘటితం కాకుండా చీలికలు పేలికలు చేస్తూ విభజించి పాలిస్తోంది. కార్మికుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను బట్టి కనీస వేతనాలు నిర్ణయించాల్సిన ‘ఇండియన్ లేబర్ కాంగ్రెస్’ను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 11 ఏండ్లుగా కనీస వేతనాలు పెంచేందుకు ఏ ఒక్క కమిటీని వేయలేదు. రాష్ట్రంలోనూ 10 ఏండ్లు బీఆర్‌ఎస్, రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేశాయి. మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలు తీవ్రం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలోని కార్మిక సంఘాలను సంఘటితం చేస్తూ కార్మిక ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తున్న సీఐటీయూ సంస్థాగత మహాసభను జరుపుకోబోతోంది..” అని సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ 7-9 తేదీల్లో మెదక్ జిల్లాలో సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభ జరగనుంది. శనివారం మెదక్ పట్టణంలోని శ్రీబాలాజీ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షులు బాలమణి అధ్యక్షతన రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మెన్‌గా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, కోశాధికారిగా బి.బాలమణి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. కార్మిక పోరాటాలకు శక్తిని, సత్తువనిచ్చే ఉమ్మడి మెదక్ జిల్లా.. 5వ రాష్ట్ర మహాసభకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీఐటీయూ అంటే ఒక సంఘం కాదని, దేశంలోని అన్ని కార్మిక సంఘాల్ని సంఘటితం చేసే శక్తి అని చెప్పారు.ప్రపంచంలో జనాభాలో భారత్ రెండో స్థానం, ఆర్థిక రంగంలో నాలుగో స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకునే ఈ దేశంలో మెజార్టీ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎందుకు మెరుగుపడలేదని ప్రశ్నించారు. దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలు ఎందుకు పెరగట్లేదని నిలదీశారు. మోడీ 11 ఏండ్ల పాలనలో కనీస వేతనాలు నిర్ణయించేందుకు ఏ ఒక్క కమిటీనీ నియమించలేదంటే కార్మిక వర్గానికి ఆయన చేస్తున్న ద్రోహం ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేట్ల దోపిడీకి ఉపయోగపడుతూ.. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేయాలనే దురుద్దేశంతోనే మోడీ నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేస్తున్నారని విమర్శించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు తీసుకునే వీలు కల్పించే పేరిట ఆంక్షలు పెడుతూ స్మార్ట్ మీటర్ల పేర విద్యుత్ సంస్కరణలు, 10 గంటల పని విధానం పేర లేబర్ కోడ్‌లు అమలు చేయిస్తున్నారన్నారు.రాష్ట్రంలో 11 ఏండ్లుగా కనీస వేతనాల జీవోను సవరించకపోవడం వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల సమయంలో ఓటర్ లిస్టుల సవరణ పేరుతో పుట్టిన ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దోపిడీలేని సమ సమాజ స్థాపన కోసం కార్మిక వర్గ పోరాటాలే పరిష్కారమన్నారు. విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలో దేశ ప్రజలు, కార్మికవర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులను చర్చించడంతోపాటు రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలు తీవ్రం చేసేందుకు కర్తవ్యాలను నిర్దేశించుకుంటామని చెప్పారు.
పోరాటాలతోనే కార్మికవర్గం ఐక్యత : ఆర్.సుధాభాస్కర్
పోరాటాలను తీవ్రం చేయడం ద్వారానే కార్మిక వర్గాన్ని సంఘటితం చేయగలరని సీఐటీయూ సీనియర్ నాయకులు ఆర్.సుధాభాస్కర్ అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కార్మికుల్ని విభజించి పోరాటాల్లోకి రాకుండా చేస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లాలో 40 ఏండ్ల కిందట ఒక ఫ్యాక్టరీలో మొదలైన సీఐటీయూ ప్రస్థానం రాష్ట్ర మహాసభ నిర్వహించే శక్తిగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాసంఘాల నాయకులు బి.మల్లేశం, జి.సాయిలు, కె.రాజయ్య, గొల్లపల్లి జయరాజు, మాణిక్యం, ఆముదాల మల్లారెడ్డి, గోపాలస్వామి, ఎల్లయ్య, భాస్కర్, బాలమణి, నర్సమ్మ, మహేందర్‌రెడ్డి, కె.మల్లేషం, కడారి నాగరాజు, సంతోష్, కృష్ణ, పాండురంగారెడ్డి, భాగారెడ్డి, బండ్ల స్వామి, బస్వరాజు, టీఎన్జీఓ రాష్ట్ర నాయకులు నరేందర్, రాజకుమార్ పాల్గొన్నారు.
కార్మికులకు అండ.. సీఐటీయూ జెండా
జెండాలు ఎన్ని ఉన్నా కార్మిక వర్గానికి సీఐటీయూ జెండా మాత్రమే అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ముందుండి పోరాడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 700 వరకు అనుబంధ యూనియన్లతో పనిచేస్తోందన్నారు. రాష్ట్ర 5వ మహాసభలో కార్మికవర్గ స్థితిగతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమగ్రమైన చర్చల ద్వారా భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుంటామన్నారు.
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
శ్రమ దోపిడీ పోవాలి.. శ్రామికులే పాలకులవ్వాలి
”శ్రమ దోపిడీ పోవాలి… శ్రామికులే పాలకులవ్వాలి” అనే నినాదంతో సమసమాజ స్థాపన కోసం ఎర్రజెండా నీడన కార్మికవర్గ పోరాటాలకు నాయకత్వం వహిస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, ఆహ్వాన సంఘం చైర్మెన్ చుక్క రాములు అన్నారు. 50 ఏండ్లుగా కేవలం కార్మికుల జీతభత్యాల పోరాటాలకే పరిమితం కాలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సామాజిక బాధ్యతతో ఆర్థిక సహాయం అందించడం, కరువు వల్ల ఆకలితో అల్లాడిన ప్రజలకు అంబలి కేంద్రాలు పెట్టి ఆదుకోవడం, పశుగ్రాసం పంచి అండగా నిలిచిన చరిత్ర సీఐటీయూ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉందన్నారు. – చుక్క రాములు