– మన దేశంలోనే నాణ్యమైన పంట
– నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– కేంద్రం గోధుమకు ధర పెంచి.. వరికెందుకు పెంచలేదు?
– కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి : హరీశ్‌రావు
– మార్కెట్ల సందర్శన.. రైతులతో చర్చలు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ కాశిబుగ్గ
ప్రధాని నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడితో ఆ దేశ పత్తిని దిగుమతి చేసేకునేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడి రైతులను మోసం చేస్తున్నారు.. ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ ద్వారా కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనగా.. వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను హరీశ్‌రావు సందర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా పత్తి పండిస్తారని తెలిపారు. ఎక్కడా లేని నాణ్యమైన పత్తి భారత దేశంలోనే పండుతుందని, తెలంగాణ రాష్ట్ర పత్తికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఇక్కడి పత్తిని ఎగుమతి చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిపోయి విదేశాల నుంచి జీరో టారిఫ్‌తో దిగుమతి చేసుకునేందుకు ప్రధాని మోడీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందన్నారు. కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు దిగుబడులను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ మార్కెట్‌లో 31 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, ఈ యేడాది ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబుడలపై బోనస్ ఇస్తామన్న మాట బోగస్ అయిందని, పంట దిగుబడులను కొనే దిక్కులేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లిందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తి, సోయా రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న రైతులకు మద్దతుగా అఖిలపక్షం చేపడుతున్న రహదారుల దిగ్బంధనానికి బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో రహదారుల దిగ్బంధనం ఆదిలాబాద్ నుంచే ప్రారంభించామని ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజరు, కోవ లక్ష్మి, అనీల్ జాదవ్ పాల్గొన్నారు.
ప్రభుత్వాల విధానాలతో పత్తి రైతుల ఇబ్బందులు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరెంట్ నుంచి కాంటాల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు సమస్యలు, జిన్నింగ్ మిల్లుల సమ్మె పరిస్థితి, సీసీఐ కొనుగోళ్ల మందగింపుపై వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను హరీశ్‌రావు సందర్శించారు. అపరాలు, పత్తి యార్డును పరిశీలించి రైతులతో మాట్లాడి ధరల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఐ తుగ్లక్ నిబంధనల వల్ల రైతులు దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఎల్1, ఎల్ 2, ఎల్3 నిబంధనలు సవరించాలని, కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని, 12 క్వింటాళ్ల పత్తి వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం విదేశీ పత్తి దిగుమతి సుంకం రద్దు చేస్తూ, స్వదేశీ రైతులపై కొత్త నిబంధనలు విధించడంతో దళారులకు మేలు చేస్తోందన్నారు. ఉత్తర భారత దేశంలో గోధుమ పంటకు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం.. దక్షిణ భారతదేశంలో పండే వరి ధాన్యంపై ధర ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులుగా మొక్కజొన్నలు కొంటున్న ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బు జమ చేయలేదని ఆరోపించారు. ఇటీవల వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కానీ ఎడల జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యాలెన్స్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినరు భస్కర్, తాడికొండ రాజయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వోడితల సతీష్ కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విదేశీ పత్తి దిగుమతికి మోడీ ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



