Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్లకు అనుకూలంగా చట్టాల మార్పు

కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాల మార్పు

- Advertisement -

– యూనియన్‌ పెట్టుకుంటే ఉద్యోగాలు పీకేస్తున్నారు
– పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– వైద్య రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– సంగారెడ్డిలో తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా యూనియన్‌ జెండాను చుక్క రాములు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టికర్తలు యజమానులే అని ప్రధాని మోడీ బరితెగించి మాట్లాడుతున్నారని, కానీ సంపద సృష్టికర్తలు మాత్రం కార్మికులేనని స్పష్టంచేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక సంఘాలను బలహీన పర్చేలా.. యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చివేస్తున్నారని విమర్శించారు. విలువైన ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రయివేటు వ్యక్తులకు అమ్మేస్తున్నదని అన్నారు.

ప్రమాదంలో ఉద్యోగ భద్రత..
కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు వ్యవస్థను విశ్వవ్యాపితం చేయడంతోపాటు లేబర్‌ కోడ్స్‌ తీసుకురావడంతో ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని చుక్క రాములు అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఒక్క రోజు వేతనం రూ.177 సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంటుందని, నెలకు రూ.4770 ఎలా సరిపోతాయే కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే, లేబర్‌ కోడ్స్‌ అమలులోకి రాకముందే యూనియన్‌ పెట్టుకున్నారని కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. బిస్లరీ వాటర్‌ కంపెనీలో ఉద్యోగులు యూనియన్‌ పెట్టుకున్నారనే సాకుతో ఐదు మంది యూనియన్‌ నాయకులను ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. వైద్య శాఖలో ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వెంటనే పీఆర్సీ ఇవ్వాలని, డీఏ బకాయిలు చెల్లించాలని తెలిపారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేసే పేషంట్‌ కేర్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ గాడ్స్‌ తదితరులకు కనీస వేతనం రూ.26వేలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో అనేక ఉద్యమాలు చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.భూపాల్‌, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఫసియొద్దీన్‌, యాదనాయక్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్‌, రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, యూనియన్‌ కార్యదర్శి ఎం.యాదగిరి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరం మల్లేశం, జి.సాయిలు, వివిధ జిల్లాల అధ్యక్షకార్యదర్శులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -