Saturday, November 29, 2025
E-PAPER
Homeక్రైమ్అమ్మా.. నీ వెంటే నేనూ..

అమ్మా.. నీ వెంటే నేనూ..

- Advertisement -

– తల్లి ఆత్మహత్యను తట్టుకోలేక వాగులో దూకిన కొడుకు
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తల్లి కొడుకుల ఆత్మహత్య ప్రతి ఒక్కరినీ కదిలించింది.. అమ్మ కోసం వెతుకుతూ వెళ్లి మానేరు వాగులో ఆమె మృతదేహాన్ని చూసి తట్టుకోలేని కుమారుడు గుండెలవిసేలా రోధిస్తూ.. తన తల్లి లేకుండా తానుండలేనంటూ వాగులో దూకేశాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచికట్ల అభిలాష్‌(30) సిరిసిల్లలోని 17వ పోలీస్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. తల్లి మంచికట్ల లలిత(56), అభిలాష్‌ ఇద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు. లలిత గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోయేసరికి కుమారుడు అభిలాష్‌ చాలా చోట్ల వెతికాడు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె కోసం గాలించారు. సిరిసిల్ల మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు శుక్రవారం స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం అభిలాష్‌కు సమాచారం అందించారు. అప్పటికే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ అభిలాష్‌ మానేరు వాగు వద్దకు వచ్చి ఆమెను తన తల్లిగా గుర్తించాడు. మృతదేహాన్ని చూసి తట్టుకోలేక రోధిస్తూ.. తల్లితోపాటే తానూ చనిపోతానంటూ మానేరు వాగులో దూకడానికి ప్రయత్నం చేయగా బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు, బంధువులు లలిత మృతదేహాన్ని పరిశీలిస్తున్న క్రమంలోనే అభిలాష్‌ ”అమ్మా.. నీవెంటే నేనూ వస్తున్నా.. ఎక్కడ ఉన్నా మనమిద్దరం ఒకే చోట ఉందాము” అంటూ మానేరు వాగులో దూకేశాడు. స్థానికులు వెతకగా.. గంట తర్వాత అతని మృతదేహం దొరికింది. సీఐ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని తల్లీకొడుకుల మృతదేహాలను పరిశీలించి శవ పంచనామా జరిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -