ఎడతెరిపి లేకుండా వర్షం
జలమయమైన రహదారులు
పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
జంటజలాశయాల గేట్లు ఎత్తివేత
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మొంథా తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు నార్సింగ్, మంచిరేవుల ప్రాంతాల్లో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచిరేవుల కల్వర్టుపై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలు బంద్ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్‌హౌల్స్ పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మాసబ్ ట్యాంకు నుంచి లక్డికపూల్ వైపు రహదారిలో మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఐటీ కారిడార్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్‌పూర్, అంబర్‌పేట, రామంతపూర్, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడ, బీఎన్‌రెడ్డినగర్, మీర్‌పేట్, బాలాపూర్, బడంగ్‌పేట్, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్, జవహర్‌నగర్‌లో వర్షం కురిసింది.
క్షేత్ర స్థాయిలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్
వర్షాల నేపథ్యంలో లక్డికపూల్ పరిసర ప్రాంతాలను బుధవారం హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్‌వీ కర్ణన్ పరిశీలించారు. మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డుపై నిలవడానికి కారణాలను అధికారులను అడిగి వారు తెలుసుకున్నారు. వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఇరువురు కమిషనర్లు ఆదేశించారు.
ఇప్పటికే ఇక్కడ ఇరువైపులా రోడ్డును తవ్వి రెండు అడుగుల విస్తీర్ణంతో ఉన్న పైపు లైన్లు వేశామని, వాటిలోకి మహవీర్ ఆస్పత్రి పరిసరాలతోపాటు చింతలబస్తీ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు, వరద నీటిని అనుసంధానం చేయాల్సినవసరం ఉందన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సహకరించి పైపులైన్ల అనుసంధాన పనులు త్వరగా జరిగేలా సహకరించాలని సూచించారు. కమిషనర్ల వెంట హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు.
జంట జలాశయాలకు భారీగా వరద నీరు
జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్‌సాగర్‌కు 3400క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో రావడంతో 2240 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు 5600 క్యూసెక్కుల వరద నీరు రావడంతో 3963 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.25 అడుగులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1789 అడుగులుగా ఉంది. మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి: జలమండలి ఎండీ
భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హౌల్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హౌల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్‌లైన్ 155313కి కాల్ చేయాలని సూచించారు.



