నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుపాను దూసుకొస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఎపిలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాధ కుమార్ తెలిపారు.
మొంథా తుపాను …
”మొంథా” గా పిలిచే ఈ తుపాను కాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తరువాత తీరం దాటుతుందని ఎపి విపత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో… ఇప్పటికే రెండు, మూడు రోజులుగా ఎపిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఈ వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ”అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. అది తీవ్రవాయుగుండగా మారి… 27 న అంటే సోమవారం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది.” అని జగన్నాధ కుమార్ వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ”తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదు. తదుపరి సూచనలు వచ్చేవరకు బోట్లను లంగరు వేసి ఉంచితే మంచిది,” అని జగన్నాధకుమార్ తెలిపారు.
రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ”మెరుపులతో కూడిన వర్షం, ఉరుములు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హౌర్డింగ్‌లు ఉన్న ప్రదేశాల్లో నిలవకండి. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్‌లో ఉంచకూడదు” అని అధికారులు జాగ్రత్తలు సూచించారు.

సోషల్ మీడియా వదంతులను నమ్మకండి : హోం మంత్రి అనిత
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడనుందన్న వాతావరణ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లలతో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం నుండి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112, 1070, లేదా 1800-425-0101 నంబర్లకు సంప్రదించాలని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.



