Monday, October 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజెన్‌ జడ్‌ నిరసనలతో హోరెత్తిన మొరాకో

జెన్‌ జడ్‌ నిరసనలతో హోరెత్తిన మొరాకో

- Advertisement -

అవినీతి, నిరుద్యోగంపై గళమెత్తిన యువత
ప్రజారోగ్యం పట్టదా అని నిలదీత

రబాత్‌ : ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలోని పలు నగరాలు జెన్‌ జడ్‌ నిరసనలతో హోరెత్తాయి. డిజిటల్‌ అసంతృప్తిని వాస్తవ ప్రపంచ ఉద్యమంగా మార్చే సామర్ధ్యం తమకు ఉన్నదని ఆందోళనకారులు, యువత హెచ్చరించారు. ఆ మహోద్యమాన్ని అధికారులు విస్మరించలేరని తెలిపారు. అవినీతిని, ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని నిరసిస్తూ ఇటీవల అనేక దేశాల్లో జెన్‌ జడ్‌ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాటి సరసన మొరాకో కూడా చేరింది. మడగాస్కర్‌, కెన్యా, పెరూ, నేపాల్‌లో కూడా ఇలాంటి ఉద్యమాలే జరుగుతున్నాయి. 2030లో జరిగే ఫీఫా ప్రపంచ కప్‌ కోసం స్టేడియంల నిర్మాణం నిమిత్తం భారీగా నిధులు వెచ్చించాలన్న ప్రభుత్వ యోచనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధ చూపని ప్రభుత్వం ఫీఫా కప్‌ కోసం పెద్ద మొత్తంలో ఎందుకు డబ్బు ఖర్చు చేస్తోందని వారు మండిపడ్డారు.

సమస్యలతో కుంగిపోతున్న ప్రజానీకం
మొరాకో నగరం ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే పెరుగతున్న జీవన వ్యయం, చాలీచాలని జీతాలు ప్రజలను కుంగదీస్తున్నాయి. మొరాకో జనాభా 3.7 కోట్లు కాగా వారిలో చాలా మందిది ఇదే పరిస్థితి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వికటిస్తున్నాయి. ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతున్నాయి. ఆఫ్రికాలో హై స్పీడ్‌ రైల్వే లైన్‌ ఉన్న ఏకైక దేశం మొరాకో. ఫిఫా ప్రపంచ కప్‌ కోసం అక్కడ ఏడు కొత్త స్టేడియంలను నిర్మిస్తున్నారు. మరో ఏడింటిని ఆధునీకరిస్తున్నారు. ప్రపంచ కప్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఐదు బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని మొరాకో యోచిస్తోంది. దేశంలో ఉద్యోగుల సగటు నెలసరి జీతం 300 డాలర్లు మాత్రమే. రహదారుల పరిస్థితి ఘోరంగా ఉంటోంది. ఆస్పత్రుల్లో వైద్యులు ఉండరు. విద్యా వ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫిఫా కప్‌కు అంత సొమ్ము ఖర్చు చేయడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రాంతీయ అసమానతలు, అర్థం పర్థం లేని ప్రభుత్వ ప్రాధాన్యతలు మొరాకో ప్రజల్లో అసంతృప్తికి, అసహనానికి కారణమవుతున్నాయి. అల్‌ హౌజ్‌ ప్రాంతంలో 2023లో వచ్చిన భారీ భూకంపం ధాటికి నిరాశ్రయులైన ప్రజల్లో చాలా మంది ఇప్పటికీ సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. అగాదిర్‌ నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డలకు జన్మనిచ్చిన అనంతరం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తర్వాత గత నెలలో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ప్రభుత్వానికి మాఫియాతో సంబంధం ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని, ఆరోగ్య మంత్రి, ఆయన వ్యాపార భాగస్వామిని నిరసనకారులు లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధిస్తున్నారు.

వలస బాటలో యువత
మొరాకోలో యువతీ యువకుల జనాభా అధికంగా ఉంటుంది. జనాభాలో సగానికి పైగా 35 సంవత్సరాలలోపు వారే. మౌలిక సదుపాయాలు, పర్యాటకంపై ప్రభుత్వం భారీగా డబ్బు వెచ్చిస్తున్నప్పటికీ 15-24 సంవత్సరాల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం 36 శాతానికి పెరిగింది. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో యాభై శాతానికి పైగా యువతీ యువకులు వలస పోయేందుకు సిద్ధమవుతున్నారు. కాగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది మైనర్లేనని అధికారులు చెబుతున్నారు. 18 సంవత్సరాలు కూడా నిండని వారిని పోలీసులు నిర్బంధించారని హక్కుల గ్రూపులు ఆరోపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -