మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ తిమ్మాపూర్
రైతులందరికీ తగినంత యూరియా అందించకపోతే ఉద్యమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో గల రాజు రహదారిపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్నలను అరిగోస పెడుతుందని, ప్రజల ఉసురు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు లైన్ లలో చెప్పులు పెట్టే పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సహకార సంఘాల చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం విడ్డూరం అన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం,మెంగని రమేష్, పొన్నం అనిల్ గౌడ్, ఎలుక ఆంజనేయులు, నోముల శ్రీనివాస్ గౌడ్, గంగిపల్లి సంపత్ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.