నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల రక్షణ, సౌకర్యాలు, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో రెండు కీలక ప్రయివేటు బిల్లులను ప్రవేశపెట్టారు. మూడు దశాబ్దాల తర్వాత తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీ ఇలాంటి ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉద్యోగ రంగంలో నెలసరి సమయంలో మహిళలకు అవసరమైన సౌకర్యాలు, అందుబాటు గదులు, శుభ్రమైన రెస్ట్‌రూములు, తగిన ఆరోగ్య వసతులు, కల్పించేందుకు చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి చేయాలని మొదటి బిల్లులో డా. కావ్య ప్రతిపాదించారు. మహిళల ఆరోగ్యం, ఉద్యోగ ఉత్పాదకత, భద్రత దృష్ట్యా ఈ చర్య అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు.
ఇక రెండో ప్రయివేటు బిల్లులో ఒంటరి మహిళలు, వితంతువులు, ఆపన్నస్థితిలో ఉన్న స్త్రీలకు ప్రభుత్వంచే అత్యవసర సహాయం, ఆధార వేతనాలు, గృహ భద్రత, సామాజిక సంక్షేమ చర్యలు తక్షణం అందేలా ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ రెండు బిల్లులను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించగా, మహిళా సాధికారత దిశగా ఇది మరొక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. వరంగల్ ఎంపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లులు దేశవ్యాప్తంగా మహిళా సంక్షేమానికి మార్గదర్శకంగా ఉండనున్నాయని మహిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూన్నాయి.



