Sunday, March 29, 2026
E-PAPER
Homeఆటలుఎం.ఎస్‌ ధోనికి గాయం

ఎం.ఎస్‌ ధోనికి గాయం

- Advertisement -

ఐపీఎల్‌కు రెండు వారాలు దూరం

నవతెలంగాణ-చెన్నై : ఎం.ఎస్‌ ధోని అభిమానులు, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్యాన్స్‌కు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌ ఆరంభం రోజు ఊహించని నిరాశ ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఎం.ఎస్‌ ధోని ఆటను చూసేందుకు అతడి అభిమానులు ఏడాదంతా ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తారు. ఐపీఎల్‌ 19వ సీజన్‌ సన్నద్ధత కోసం నెల రోజుల ముంగిటే చెన్నై చేరుకుని సాధన మొదలెట్టిన ధోని.. గాయం బారిన పడ్డాడు. పిక్క కండరాల గాయానికి గురైన ధోని కనీసం రెండు వారాలు ఆటకు దూరమైనట్టు సూపర్‌కింగ్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎం.ఎస్‌ ధోని ప్రస్తుతం పిక్క కండరాల నొప్పి నుంచి కోలుకుంటున్నారు. ఐపీఎల్‌ 2026కు తొలి రెండు వారాలు దూరమయ్యే అవకాశం ఉంది. ధోని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని’ చెన్నై సూపర్‌కింగ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

ఐపీఎల్‌19ను చెన్నై సూపర్‌కింగ్స్‌ సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరుతో మొదలుపెట్టనుంది. గువహటిలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ లేదా ఊర్విల్‌ పటేల్‌, కొత్త ఆటగాడు కార్తీక్‌ శర్మలలో ఒకరు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌ తొలి రెండు వారాల్లో సూపర్‌కింగ్స్‌ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఏప్రిల్‌ 3న పంజాబ్‌ కింగ్స్‌తో, 5న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో, 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, 14న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. వీటిలో మూడు మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నాయి.

ఏప్రిల్‌ 18న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు ఎం.ఎస్‌ ధోని అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పేసర్‌ నాథన్‌ ఎలిస్‌ (ఆస్ట్రేలియా) గాయంతో తప్పుకోవటంతో.. అతడి స్థానంలో మరో ఆసీస్‌ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో యువ ఆటగాడు కార్తీక్‌ శర్మను రూ.14.20 కోట్లతో సూపర్‌కింగ్స్‌ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ధోని 14 మ్యాచ్‌ల్లో 135.17 స్ట్రయిక్‌రేట్‌తో 196 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 30 నాటౌట్‌. నిరుడు ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సూపర్‌కింగ్స్‌ ఈ ఏడాది ఏకంగా టైటిల్‌పై కన్నేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -