Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ నామినేషన్లు 28456

మున్సిపల్‌ నామినేషన్లు 28456

- Advertisement -

రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు
అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 2,200
నేడు పరిశీలన, రేపు అప్పీళ్లు
ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా
ఫ్రీ సింబల్స్‌ విడుదల చేసిన ఈసీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం శనివారం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే నామినేషన్‌ వేసేందుకు అభ్యర్ధులు క్యూ కట్టారు. దాంతో 5 గంటల లోపు వచ్చిన వారికి రిటర్నింగ్‌ అధికారులు అవకాశం కల్పించారు. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డులకు సంబంధించి రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 28456 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌- జోగిపేట, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్‌, జిన్నారం, కోహిర్‌, నారాయణఖేడ్‌, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాల్టీల్లో 2,200 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు చొప్పదండి, హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాల్టీల్లో 1,947, నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు చండూర్‌, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ మున్సిపాల్టీల్లో 1,795, సూర్యపేట జిల్లాలో హుజుర్‌నగర్‌, కోదాడ, నేరేడుచర్ల, సూర్యపేట, తిరుమలగిరి మున్సిపాల్టీల్లో 1,617 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది.

రేపటి నుంచి అప్పీళ్లకు అవకాశం
మున్సిపల్‌ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. అనంతరం చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితాను ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ప్రచురిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్‌, సబ్‌ కలెక్టర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారిపై ఫిబ్రవరి 1న అప్పీల్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న అప్లీళ్లను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఉదయం 8గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. పోలింగ్‌లో ఏవైనా అవాంతరాలు జరిగితే 12న రీ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 14న మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నిక కోసం సంబంధిత కలెక్టర్‌ నియమించిన అధికారి ప్రత్యేక సమావేశం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 16న ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

గుర్తులు కేటాయించిన ఈసీ
మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాల్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ శనివారం గుర్తులు కేటాయించింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఆయా పార్టీల గుర్తులుంటాయని తెలిపింది. తెలంగాణ ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరై గుర్తులు కేటాయించని పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు మొత్తం 75 గుర్తులను ఈసీ కేటాయించింది. అందులో మొదటి గుర్తు ఏయిర్‌ కండిషనర్‌, రెండవ గుర్తు యాపిల్‌ కాగా, చివర మూడు గుర్తులు వరుసగా ఈల, కిటికీ, ఊలు సూదిగా ఉన్నాయి. ఫిబ్రవరి 3న తుది జాబితా ప్రకటించిన తర్వాత ఆల్ఫాబేటికల్‌ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. ఇద్దరు ఒకే పేరుతో ఉంటే ఇంటి పేరు, వృత్తిని పరిగణంలోకి తీసుకుని రిటర్నింగ్‌ అధికారి గుర్తును కేటాయిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -