Sunday, August 3, 2025
E-PAPER
Homeసమీక్షసంగీత, సాహిత్య, జీవనానుభవాలు

సంగీత, సాహిత్య, జీవనానుభవాలు

- Advertisement -

ప్రముఖ వయెలినిస్టు ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని (1893- 1964) ఎరగని సంగీత ప్రేమి బహుశా వుండడు అనే చెప్పుకోవాలి. వారి మనవడు ద్వారం దుర్గా ప్రసాదరావు (జననం 4-4-1942). తాత తండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ ప్రముఖ వయెలినిస్టు అని వీరు కూడా అనిపించుకున్నారు. ఒక్క సంగీతంలోనే కాదు సాహిత్యం, చిత్రకళ, శిల్పకళల్లో కూడా ప్రవీణులు. తన 75వ ఏట కవిత్వం, చిత్రలేఖనాలను వివరించే ‘రంగులు – రచనలు’ జనావళికి అందించి అభినందనలు పొందినారు. తన సహస్ర చంద్రదర్శనవేళ ఈ ‘జీవాళి’ అనే పుస్తకం అందిస్తున్నారు. 2025కు దుర్గాప్రసాద్‌ జీవితంలో మరో ప్రత్యేకత వుంది. వారు తన ధర్మపత్ని శ్రీమతి రాజ్యలక్ష్మిని తన జీవితంలోకి ఆహ్వానించి, 50 ఏళ్ల స్వర్ణోత్సవ సహజీవనాన్ని ఆస్వాదించిన సంవత్సరం.
పుట్టి పెరిగి, బుద్ది తెలిసిన నాటి నుండి సంగీతంలో మునిగి తేలిన వీరికి సంగీతంతో పాటు, సాహిత్య రసజ్ఞత, గొప్ప అభివ్యక్తి అలవడింది అని ఈ ‘జీవాళి’ చదివిన మీరు కూడా ఒప్పుకుంటారు. 354 పేజీలు గల ఈ ప్రతిలో 85 అధ్యాయాల్లో, పాఠకున్ని ఆలోచింపజేసే తత్త్వం వుంది. ఎందరో సంగీత నిష్ణాతులను అతి దగ్గరగా గమనించి, వీరితో సహ కచేరీలు చేసి తెలుసుకున్న అనుభవాల వివరణలు వున్నాయి.
ఈ ఉద్గ్రంధంలోకి వెళ్లే ముందు ‘జీవాళి’ గురించిన మరో విశేషం. సంపాదకులు శ్రీ ఎన్‌.కె.బాబు, మోదుగుల హరికృష్ణ. సుమారు దశాబ్దకాలం నుండి తెలుగు కథా ప్రపంచంలో ఏటా మంచి కథలను ఔత్సాహికుల వద్ద నుండి సేకరించి ప్రచురించి పంపిణీ చేస్తారు ఎన్‌.కె.బాబు. ప్రావీణ్యత సంపాదించుకున్న సంగీతజ్ఞుడు. అక్షరాలను సేకరించి అందంగా ముద్రించి పాఠకులందజేసే అనుభవం గల సంపాదకులు. వీరిద్దరి ‘జుగల్‌బందీ’లో ‘జీవాళి’ రసజ్ఞులైన తెలుగు పాఠకులకు ఓ షడ్రసోపేతమైన విందు అనవచ్చును.

మూడేళ్లుగా కొనసాగిన ఈ అక్షర యజ్ఞం గురించి రచయిత మాటల్లోనే… ”నాకు తెలిసిన గొప్ప వ్యక్తుల సుగుణాల గురించి నా తెలివిడితో రాశాను… నాకు తెలిసిన నా ప్రపంచాన్ని అక్షరాల్లో పొందుపరిచాను. అక్కడక్కడ ఇతరుల రాతలను అనువదించాను. నా ఆనందాన్ని వెదుక్కునే ప్రయత్నంలో చిత్రించిన కొన్ని చిత్రాలను ఇందులో అలంకరించాను. నా రాతల్లో తారసపడిన వారిని ఛాయా చిత్రాల్లో అద్దాను. కొన్ని కొన్ని ప్రాంతాలను కూడా ఆ కోవలోనే ఛాయాచిత్రాలుగా చూపాను. ఈ పుస్తకం నాలుగు తరాల సంస్కృతికి, సంప్రదాయాలకు వారధిగా వుంటుందని భావిస్తున్నాను”.
సహస్ర చంద్రదర్శన అనుభవజ్ఞుడు, సంగీత విజ్ఞుడు అయిన ద్వారం దుర్గాప్రసాదరావుగారిపై అభిప్రాయంతో ఈ పుస్తకం చదివాక మీరూ ఏకీభవిస్తారు.
మొదటి అధ్యాయంలో వాద్యగాత్ర సంగీతాలకు ‘ఆధారశృతి’ యైన తంబూరా గురించి చెబుతూ, తంబూరాలోని మేరువ (బ్రిడ్జ్‌) పైన ఆనిన 4 తీగలకు, మేరువకు మధ్యనుంచే దారాల వరుసను ‘జీవాళి’ అంటారని, ఆదారాలు సెక్షనల్‌ ప్రకంపనలకు ప్రేరేపించి, తంబూరానాదంలో జీవం నింపుతాయి అట. కచేరీలో పాట ఆగినా తంబూరా మోగుతూనే వుంటుంది. జీవకోటియందు కూడా ఒక సన్నటి సూత్రమేదో నిరంతరం జీవశక్తిని నింపుతూ, మనుగడను సుఖప్రదం చేస్తుంది. కనుక ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టాను” అంటారు రచయిత. జీవికీ జీవికీ మధ్య ఈ కనపడని సూత్రమేధో బంధించి వుంచుతుందన్న సత్యం జగద్వితం.
మొదట తమ పూర్వీకులు కరింకోలులో వాసులని చెబుతూ తాతతండ్రులు బ్రిటీష్‌ వారి వద్ద ఉద్యోగం చేసేవారని చెబుతారు. ద్వారం వెంకట స్వామినాయుడుగారు విశాఖలో నాలుగో తరగతి చదువుతుండగా దృష్టి మాంధ్యం వల్ల చదువు మానేసి అన్నగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. అందులో భాగంగా వయొలిన్‌ నేర్చుకున్నారట. సంగీతం అంటే వినికిడి విద్య అంటారు రచయిత. వెంకటస్వామి గారు దక్షిణ భారత సంగీతాన్ని తన వయొలిన్‌ మీద ఎంత బాగా పలికించేవారో, ముస్లింల ఇళ్లలో కచేరీ చేసినప్పుడు నాతియాలు కలామ్‌లు, మార్సియలు, ఆంగ్ల కచేరీలలో పాశ్చాత్య సంగీతమూ అంత బాగా ప్రదర్శించేవారట! మహరాజ ప్రభుత్వ నృత్య కళాశాల విజయనగరం, హైద్రాబాద్‌లోని సంగీత కళాశాలల్లో పనిచేసిన వారు (ప్రసాద్‌గారు) విజయనగరంలో స్థిరపడి సంగీత, సాహిత్యాలకు ఇతోధిక సేవ చేస్తున్నారు.

‘జీవాళి’లో సామన్య పాఠకులకు ఆసక్తి కలిగించే కొన్ని అంశాలు.
1. విజయనగరం సంగీత నృత్య కళాశాల (పే.18).
2. రచయిత బాల్యం విద్యాభ్యాసం, ఉద్యోగం (25, 32, 35, 51) కుటుంబ నేపధ్యం.
3. రచయిత సాహిత్య పరిచయం (పే.73, 230, 234, 240, 243, 256).
4. రచయిత అభిప్రాయం ప్రకారం ప్రతిభ, ప్రావీణ్యం, తేలంబు సంగీతం స్వరాలు.
5. వ్యక్తుల పరిచయాలు (115, 119- 127, 130- 193, 219, 248 – 256, 277-312).
6. ఆనందమూ, ఆవేశమూ పాజిటివ్‌ ఎనర్జీలు. ఈ రెండున్నూ మన నియంత్రణతో ఆత్మతృప్తి కలుగుతుంది (194).
7. అసలు కంటే వడ్డీ ముద్దు అన్న సామెతలా మనమలిచ్చే ఆనందం మనువు కూడా ఇవ్వలేదు (67) అంటారు.
8. మేళం, మేళకట్టు అంటే (68) భోగం మేళం. ఇప్పుడు చులకన పదం అయింది కానీ ఆ రోజుల్లో మేళం అంటే గొప్పపదం. కచేరీ.
9. నాకు ఇద్దరే గురువులు. నా అన్నయ్య నా చెవి (72).
10. దుర్గా ప్రసాద్‌ గారి వ్యాసాలు, కవితలు (18, 73, 94 -104, 105, 110 – 114, 209, 225, 230 – 256, 320 – 323, 338 – 340.
11. ఉత్తరాంధ్ర భాష, యాసలో చెప్పిన ‘ఇజి నారం’ (73).
12. మనం బతికేది ఈ ఆరింటికోసం – అన్నం, నీళ్లు, బట్ట, ఇల్లు, పని, స్నేహం. అయితే బోసి తాతలకు ఇంకో ఆరు కావాలి. అవి సులోచనాలు, కట్టుడుపళ్లు, భూతద్దం, చేతికర్ర, చెవి మెషీను (75).
13. మనవలు, మనవరాళ్లు, తమ తాతయ్య, అమ్మమ్మ/ నానమ్మ గురించి రాసిన ఇంగ్లీషు వ్యాసాలు (349-356).
సంగీతాసక్తులకు సముద్రమంత సమాచారం దొరుకుతుందీ గ్రంథంలో… పబ్లిషన్స్‌ చెప్పినట్లు వేరెవ్వరికీ సాధ్యం కాని పని (రచన) ఇది. రచయితకు, ఎన్‌.కె.బాబు పబ్లిషర్‌ గారు రచయిత వెంటపడి రాయించినందుకు అభినందనలు.
– కూర చిదంబరం, 8639338675.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -