నవతెలంగాణ – వనపర్తి
చట్టాలపై ప్రతి ఒక్కరినీ అవగాహన కలిగి ఉండాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి రజని ఆదేశాలనుసారం శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామ పంచాయతీలో, ప్రాథమిక పాఠశాల పెద్దగూడెం, వనపర్తిలోని హరిజనవాడ కాలనీలోని కర్రెమ్మగుడి ప్రాంగణంలో ప్రజలకు, రైతులకు విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాలలో కృష్ణయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.
పెద్దగూడెంలోని రైతు వేదికలో గతంలో ప్రారంభించిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా రైతులు సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం మరియు న్యాయ సలహాలను పొందవచ్చని తెలియజేశారు. హరిజనవాడ కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం మరియు మోటార్ వాహనాల చట్టం గురించి తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాజాత బృందం ప్రజలలో చట్టాలపై అవగాహన పెంపొందించే విధంగా పాటలను పాడారు.



