వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపా
పరిశ్రమలో నైపుణ్యాల పెంపు కోసం కార్ఫస్ ఫండ్ : సీఎం రేవంత్‌రెడ్డి
‘తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫెడరేషన్‌తో చర్చలు సఫలమయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం సాయంత్రం పలువురు దర్శక, నిర్మాతలు సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. పరిశ్రమలో వివాదం వద్దనే ఫెడరేషన్‌తో చర్చలు సఫలమయ్యేలా చర్యలు తీసుకున్నా. త్వరలోనే సినీ కార్మికులతోనూ మాట్లాడతా. సినీ కార్మికులతోపాటు నిర్మాతలనూ మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. అలాగే కార్మికుల విషయంలో నిర్మాతలూ మానవత్వంతో వ్యవహరించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు చాలా అవసరం. అలాగే సినీ పరిశ్రమపై మానిటరింగ్ కూడా అవసరమే. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఓ పాలసీ తీసుకువస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇకపై పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. దీన్ని ఆ స్థాయిలోనే ఉంచడమే నా ధ్యేయం. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణలు కూడా జరుగుతున్నాయి. అలాగే తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అలాగే పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అలాగే స్కిల్ యూనివర్శిటీలో కూడా సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజుతోపాటు నిర్మాతలు అల్లుఅరవింద్, సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్, జెమీని కిరణ్, డీవీవీ దానయ్య, వంశీ, గోపీ ఆచంట, చెరుకూరి సుధాకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, అనిల్‌సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్‌కేఎన్, కె.కె.రాధామోహన్, దామోదర ప్రసాద్, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటిశ్రీను, సందీప్‌రెడ్డి వంగా, వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు.