(1) నిర్నిద్ర మబ్బుల్ని రెప్పలపై
మోస్తూ
అర్థాంతరంగా
ఆగిపోయిన నా హరిత స్వప్నాలతో
పేలవమైన
ఈ రాత్రి పీలికల మధ్య చీకటి పోగుల్ని
వేళ్ళకు చుట్టూకుంటూ
ప్రతి ఉదయం
ఎండ పొడ నీడల మీద వీరుల ఊపిరి
సంతకాలని చూస్తున్నా
చెమట చుక్కలతో
నెత్తుటి బొట్లతో
దొప్పెడు భూమిని కప్పుకున్న
శిధిల స్థూప శిఖరం పై రెపరెప లాడుతున్న
ఆ ఆశయ ద్యాసను శ్వాసి స్తున్నా…
(2) నేనిప్పుడు
అడవి గురించి అడుగుతున్నా
మా బతుకు గురించి అడుగుతున్నా??
మా మెతుకు గురించి అడుగుతున్నా
ఆచూకీని ఆకాశానికెత్తేసి
ఉనికిని ఊదరపేట్టేసి
నువ్వు తవ్వుతున్న
నా అడుగుకింది నేల ఎవడి సొత్తు
నువ్వుకూల్చుతున్న
నా చెట్టుకింది నీడ ఎవడి పట్టు
నాకు నా అడవికావాలి
నాకు నా ఆనవాలుకావాలి
మా పూర్వికులు
దువ్వుకున్న పిడికెడు
పసిరిక కదారా
నా సంస్కతి
- ఇసాక్ హుస్సేన్, కాగజ్‌నగర్