శాసనమండలి ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నల్లగొండ మున్సిపాల్టీ కార్పొరేషన్‌గా మారింది. ఈ మేరకు మంగళవారం శాసనమండలిలో దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన మున్సిపల్ సవరణ బిల్లును మండలి ఆమోదించింది. అంతకుముందు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలను క్రమబద్ధం చేసేందుకు వీలుగా 2025 అక్టోబర్‌లో ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ప్రవేశపెట్టిన మరో మున్సిపల్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి ఒకే చెప్పింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సవరణలకు అనుగుణంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టిన జీఎస్టీ సవరణ బిల్లును మండలిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ సభ్యులు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ జీఎస్టీ ఎగవేతకు దారి తీస్తున్న లోపాలను సరి చేయాలని సూచించారు. నిఘాను మరింత పటిష్టం చేయాలని కోరారు. సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని హరించేలా పన్నులు వేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లుతున్న నిధులు తిరిగి రాష్ట్రానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేసేందుకే కేంద్రం వన్ నేషన్-వన్ జీఎస్టీ అంటున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సభ్యులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అందరం ఒక్కటై పోరాడినట్టు మరోసారి ఐక్యంగా పోరాడాల్సి ఉందని సూచించారు. ఎంఐఎం సభ్యులు ఎఫెండీ మాట్లాడుతూ జీఎస్టీని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదని తెలిపారు. జీఎస్టీలో ఇంకా లోపాలున్నాయనీ, వాటిని సరి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
పెద్దల సభ గౌరవం నిలపాలి : మహేశ్ కుమార్ గౌడ్
పెద్దల సభ గౌరవం నిలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్ లో నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎక్కువగా ఇవ్వాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ 16 ఏండ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాననీ, గత రెండేండ్ల నుంచి నిధులివ్వడం ఆగినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్సీల విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాలని కోరారు.
నివరధిక వాయిదా
శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మంగళవారం సాయంత్రం 4.35 గంటలకు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిని నిరవిధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఐదు రోజుల పాటు మండలి సమావేశాలను నిర్వహించారు. 19 గంటల 52 నిమిషాల పాటు 34 మంది సభ్యులు మాట్లాడారు. 33 ప్రశ్నలను సభ్యులు వేశారు. 13 బిల్లులను, ఒక తీర్మానాన్ని మండలి ఆమోదించింది. ఒక అంశంపై స్వల్పకాలిక చర్చను చేపట్టింది.
మున్సిపల్ కార్పొరేషన్‌గా నల్లగొండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



