Monday, March 23, 2026
E-PAPER
Homeదర్వాజమానవాళి బాధను అక్షరబద్ధం చేసిన నందిని సిద్ధారెడ్డి

మానవాళి బాధను అక్షరబద్ధం చేసిన నందిని సిద్ధారెడ్డి

- Advertisement -

సాహిత్య జగత్తులో కొన్ని కావ్యాలు పాఠకుడిని ఆలోచింపజేస్తే, మరికొన్ని కావ్యాలు అంతరంగాన్ని మేల్కొల్పుతాయి. ఇంకొన్ని కావ్యాలు మాత్రమే మనిషిని తన మూలాల్లోకి తీసుకెళ్లి, ప్రకృతితో అతనికి ఉండాల్సిన సంబంధాన్ని గుర్తుచేసి, జీవితం పట్ల బలమైన ఆశావాదాన్ని, భరోసాను నింపుతాయి. అలాంటి అరుదైన, అద్భుతమైన కావ్యమే డా. నందిని సిద్ధారెడ్డి కలం నుండి జాలువారిన ‘అనిమేష’. జాతీయ స్థాయిలో తెలుగు కీర్తి పతాకను ఎగురవేసిన అపురూపమైన సందర్భం ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే అత్యున్నత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2025 సంవత్సరానికి గాను) సుప్రసిద్ధ కవి, దార్శనికుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌ డా. నందిని సిద్ధారెడ్డికి లభించడం యావత్‌ తెలుగు సమాజానికి గర్వకారణం. కరోనా లాంటి ఒక భయానక విపత్తు కాలంలో మనిషి మనుగడను, ప్రకృతితో అతనికి ఉన్న అనుబంధాన్ని, సామాజిక రుగ్మతలను కళ్లకు కడుతూ ఆయన రాసిన ‘అనిమేష’ (ఉపద్రవగాథ) దీర్ఘ కవితా సంపుటికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

డా. నందిని సిద్ధారెడ్డి ఒక కవి మాత్రమే కాదు, నిరంతరం సమాజ హితాన్ని కోరుకునే ఒక సామాజిక వైద్యుడు. ఆయన పుట్టుక, పెరిగిన వాతావరణమే ఆయన ఆలోచనలకు పదును పెట్టాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బందారం గ్రామంలో 1955 జూన్‌ 12న ఆయన జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన నిఖార్సయిన కమ్యూనిస్టు యోధుడు. తల్లి రత్నమాల. బందారం, వెల్కటూరు, సిద్దిపేట ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేసిన ఆయన, ‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు’అనే అంశంపై ఎం.ఫిల్‌, ‘ఆధునిక కవిత్వం: వాస్తవికత – అధివాస్తవికత’అనే అంశంపై పీహెచ్‌.డీ సాధించారు. మెదక్‌, సిద్దిపేట ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకుడిగా వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూనే, తన కలంతో కోట్ల మందిని జాగృతం చేశారు. ‘బందారం కనిపెంచిన మందారం’ అని ప్రముఖులు ఆయనను కీర్తించడం వెనుక ఆయన మట్టితో పెనవేసుకున్న అనుబంధం కనిపిస్తుంది.

తెలంగాణ ఉద్యమంలో సిద్ధారెడ్డి పోషించిన పాత్ర చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. విద్యార్థి దశ నుంచే కథలు, కవిత్వం రాసిన ఆయన నవసాహితి, మెదక్‌ స్టడీ సర్కిల్‌ లాంటి సంస్థలను స్థాపించారు. ముఖ్యంగా ‘మంజీరా రచయితల సంఘం’ఏర్పాటు చేసి ఎందరో యువ కవులను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూ ఆయన రాసిన ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ’పాట (పోరు తెలంగాణ సినిమాలోనిది, నంది అవార్డు గ్రహీత) తెలంగాణ పల్లెల్లో ప్రతిధ్వనించింది. ఉద్యమకారుడిగా, మేధావిగా ఎదిగిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేశారు. ‘ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా’, ‘ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం’ లాంటి పాటలతో పాటు ఎన్నో వ్యాసాలు, కవితా సంపుటాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన జీవితమంతా ఒక నిరంతర అన్వేషణ, ఒక ధిక్కార స్వరం. ఇప్పుడు ‘అనిమేష’ ద్వారా మనిషి మనుగడకు కావలసిన మూలాధార జ్ఞానాన్ని మన ముందు ఉంచారు.

‘అనిమేష’ అంటే రెప్పపాటు లేనిది, నిరంతరం అప్రమత్తంగా ఉండేది అని అర్థం. ఈ కావ్యం పేరుకు తగ్గట్టుగానే ప్రమాదాల పట్ల, ఉపద్రవాల పట్ల తప్పకుండా జాగరూకతతో కూడిన అవగాహనను ఈ పుస్తకం చక్కగా వివరించింది. ఇది కేవలం ఒక కవిత్వ పుస్తకం కాదు; ఒక క్లిష్ట సమయంలో (కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో) మానవాళి పడిన లోతైన పెయిన్‌ (బాధ) ను అక్షరబద్ధం చేసిన దస్తావేజు. ఒక్కో గాథ ఒక్కో గాయాన్ని తడుముతుంది, కానీ అంతిమంగా మన మనసును ఆశావాదంలోకి మళ్లిస్తుంది. ఎంత శక్తివంతమైన వైరస్‌ వచ్చినా, దానికి లొంగని శక్తివంతమైన నమ్మకాన్ని మనిషికి పట్టిస్తుంది. ఆత్మశోధన ఎంతో బలంగా చేస్తే కానీ, ఇంత కమ్మని కావ్యం రూపుదాల్చదు. ఈ కావ్యంలో కవిత్వం అల్లుతున్న సందర్భంలో కంటెంట్‌ ఎక్కడ పక్కదారి పట్టకుండా చూసుకోవడం సిద్ధారెడ్డి గారి నైపుణ్యానికి నిదర్శనం. కొత్తగా చదివిన పాఠకుడికి ఉద్దీపన కలిగించేలా, పాత పాఠకులను సంతప్తి పరిచేలా ఆలోచనల పుష్టిని, పరిపుష్టిని ఈ పుస్తకం అందిస్తుంది.

”మతం ఒక వైరస్‌/ ఎప్పుడో మెదడును కమ్మేసింది/ రాజకీయం మరో వైరస్‌/ రక్తనాళాల్లో చేరిపోయింది/ వ్యాపారం వావిలేని జీవి/ మనసును మత్పరించింది…./ ఇవ్వాళ మనిషి ఎక్కడ దొరుకుతాడు” ఈ కవితా పంక్తులలో కవి నందిని సిద్ధారెడ్డి సమాజం పట్ల తనకున్న అపారమైన క్లారిటీని ప్రదర్శించారు. ప్రపంచాన్ని వణికించిన భౌతిక వైరస్‌ (కరోనా లాంటిది) రాకముందే, మానవ సమాజం ఎప్పుడో కొన్ని ప్రమాదకరమైన సామాజిక వైరస్‌ల బారిన పడిందని కవి ఎంతో వేదనతో చెప్తున్నారు. మతాన్ని ఒక వైరస్‌గా పోలుస్తూ, అది మనిషి ఆలోచనా శక్తిని (మెదడును) ఎలా కమ్మేసిందో, మనిషిని ఎలా గుడ్డివాడిని చేసిందో వివరించారు. అలాగే, స్వార్థపూరితమైన రాజకీయాలను మరో వైరస్‌గా అభివర్ణించారు. ఈ రాజకీయ వైరస్‌ మనిషి రక్తనాళాల్లో చేరిపోయి, మనుషుల మధ్య అంతరాలను, ద్వేషాలను ఎలా పెంచుతోందో సూటిగా చెప్పారు. ఇక వ్యాపారం అనేది మానవీయ సంబంధాలను, విలువలను (వావివరసలను) మర్చిపోయిన ఒక క్రూరమైన జీవిగా మారి, మనిషి మనసును ఎలా మత్తులో (మత్పరించి) ముంచిందో అత్యంత కవితాత్మకంగా చెప్పారు.

”మనిషి విజృంభించేది ప్రకృతి మీద/ ప్రకృతి విజృంభించేది మనిషి మీదే…/ సమస్త ప్రాణి/ సహజీవనానికి/ పూచి పడాల్సింది మనిషే.” ప్రకృతికి, మనిషికి మధ్య ఉండాల్సిన అసలైన సంబంధాన్ని కవి ఇంతకంటే అద్భుతంగా, సులభంగా చెప్పలేరు. మనిషి తన మేధస్సుతో, సాంకేతికతతో, దురాశతో ప్రకృతి మీద ఎంతో విజృంభిస్తున్నాడు. అడవులను నరికేస్తూ, నదులను కలుషితం చేస్తూ ప్రకృతి సహజత్వాన్ని నాశనం చేస్తున్నాడు. దానికి ప్రతిఫలంగానే ప్రకృతి కూడా మహమ్మారుల రూపంలోనో, ప్రకృతి విపత్తుల రూపంలోనో మనిషి మీదే విజృంభిస్తోంది. ఇది ఒక విష వలయం.
అయితే, ఈ భూమి కేవలం మనిషిది మాత్రమే కాదు. సమస్త ప్రాణికోటికి (జంతువులు, పక్షులు, చెట్లు) ఇది నివాసం. ఈ సృష్టిలో ఆలోచనా శక్తి ఉన్న ఒకే ఒక్క ప్రాణి మనిషి కాబట్టి, ఆ ”సహజీవనానికి పూచీ పడాల్సింది (బాధ్యత వహించాల్సింది) మనిషే” అని కవి ఎంతో స్పష్టంగా బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ప్రకృతి ఆదేశానుసారం మనం ఎలా జీవించాలో, మన జీవితాన్ని ఎలా నిర్దేశించుకోవాలో ఈ కావ్యం నేర్పుతుంది.

నందిని సిద్ధారెడ్డి ‘అనిమిష’కవిత్వంలో అతి పెద్ద బలం దాని సహజత్వం. విత్తనం ఎంత సహజంగా మొలకెత్తునో, ఆకులు ఎంత సహజంగా చిగురిస్తాయో, పువ్వులు ఎంత సహజంగా విచ్చుకుంటాయో అంతే సహజంగా సిద్ధారెడ్డి కవిత్వం వికసించిందని చెప్పొచ్చు. ప్రజల బాధను, ప్రపంచం బాధను తనకొచ్చిన బాధగా భావించారు కాబట్టే, హృదయం ద్రవించే ఈ కవిత్వం తన్నుకు వచ్చింది. ఈ కావ్యం బాధను చిక్కటి కవిత్వంగా చేసిందని చెప్పొచ్చు. అట్లని పరిష్కారాలు చూపలేదా అంటే, అవి మన జీవన విధానంలోనే ఉన్నాయని క్రమానుసారంగా గాథలను వివరించుకుంటూ, మెళుకువలను నూరిపోస్తూ పోతారు. ఈ పుస్తకం చదివిన తరువాత సిద్ధారెడ్డి కేవలం ఆశావాది కాదు, అలాగని నిరాశావాది కాదు అని అర్థమవుతుంది.

ఆయనది ఒక ”సంభావ్యత దృక్పథం” (Perspective of Probability), ఒక సకారాత్మక అభిప్రాయం (Positive mindset) కలవారని తెలుస్తుంది. మనిషి ఎప్పుడూ ఓడిపోకూడదని, కష్టాలను జయించి ‘విన్నర్‌ సర్కిల్లో’ జీవించేలా ఇష్టపడతాడు ఈ కవి. అనేక గాథల్లో చర్చించిన అనేక అంశాలు విశ్వజనీనమైనవి. జీవితానికి ఏ స్థాయిలోనైనా అన్వయించుకోగల గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. చివరగా, ”అనిమిష” కావ్యం రాత్రికి రాత్రే మన జీవితాలను మార్చే అద్భుతమైన మంత్రదండం అని చెప్పే సాహసం చేయలేము. కానీ, పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడే ఒక మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని మాత్రం ఈ కావ్యం తప్పకుండా అందిస్తుందని కచ్చితంగా చెప్పగలం. తెలుగు కవిత్వ కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఎగురవేసి, ఇంత మంచి కావ్యాన్ని, మూలాధార జ్ఞానాన్ని మనకు అందించిన డా. నందిని సిద్ధారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!

డా. బండారు విజయ్ కుమార్‌,
9866703130

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -