ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి
వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో 20 నుంచి 22 వరకు రైతు మేళా : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఈ నెల 22న సీఎం ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహిస్తామన్నారు. ఆ మేళాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన యంత్రాలు, ఆయిల్ పామ్ సాగు విధానాలు, ఉత్పత్తి పెంపు మార్గాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నర్మెట్ల ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతున్నదని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రెండు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. నర్మెట్టలో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించామన్నారు. ప్రారంభ దశలో ఈ యూనిట్ గంటకు 30 టన్నుల సామర్థ్యంతో చేస్తుందనీ, భవిష్యత్తులో గంటకు 120 టన్నుల వరకు విస్తరించే విధంగా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ యూనిట్ ప్రారంభంతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో నూనె తయారీ వల్ల నాణ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశముంటుందని వివరించారు.
22న నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



