నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నవంబర్,27 న జరిగే ఒకరోజు జాతీయ సదస్సు కరపత్రాలను సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం ఆవిష్కరించారు.”కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు మరియు అవరోధాలు” అనే అంశంపై ఈ జాతీయ సదస్సు జరగనున్నదని సదస్సు సమన్వయకర్తలు డాక్టర్ పి.రామకృష్ణ, భరత్ రాజ్ లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న విద్యావంతులు పాల్గొని, ఫలవంతమైన చర్చలు జరిపి, భవిష్యత్ నిర్దేశిత తీర్మానాలను చేయాలని ఆకాంక్షించారు.
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగరత్నం మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావాలను తెలుసుకొని, విజ్ఞాన శాస్త్రాలను మానవాళికి మరింత చేరువ చేయాలని సూచించారు. కృత్రిమ మేధ గురించి సమాజంలో పెరుగుతున్న వివిధ అపోహలను తొలగించి, కృత్రిమ మేధతో కూడిన విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసేలా,ఆ దిశలో ఉన్న అవకాశాలను, ఎదురవుతున్న సవాళ్లను తెలియజేసే ప్రయత్నంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని సమన్వయకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, పి.ఆర్.ఓ. డాక్టర్ దండుస్వామి, ఎన్.సి.సి.అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం.రామస్వామి, వినయ్ కుమార్, రంజిత,రమేశ్ గౌడ్, జయప్రసాద్, విజయ, పద్మ, ఏ.ఓ.రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.