Wednesday, July 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

- Advertisement -

– ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌
– ముచ్చింతల్‌ మండల పరిషత్‌ హైస్కూల్లో అదనపు తరగతి గదులు
– జూపల్లి బాలమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మాణం
నవతెలంగాణ-శంషాబాద్‌

నాణ్యమైన విద్య ద్వారానే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మై హౌమ్‌ గ్రూప్‌, జూపల్లి బాలమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన 12 అదనపు తరగతి గదులను మంగళవారం జేబీఎం ట్రస్ట్‌ డైరెక్టర్‌ జూపల్లి జగపతిరావుతో కలిసి కపిల్‌ దేవ్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుని దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలన్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని తెలిపారు. గతేడాది ఈ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యానని గుర్తు చేశారు. అప్పటికి, ఇప్పటికీ పాఠశాల స్వరూపమే మారిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి మై హౌమ్‌ గ్రూప్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు ప్రాంతీయ భాషలతో పాటు జాతీయ, అంతర్జాతీయ భాషలు నేర్చుకోవాలని సూచించారు. తన సంస్థ ఖుషి ఫౌండేషన్‌ ద్వారా పాఠశాలకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మై హౌమ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి జగపతిరావు మాట్లాడుతూ.. తన అన్న మై హౌమ్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జూపల్లి రామేశ్వరరావు సంకల్పంతో ఈ పాఠశాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరలో గ్రామంలో 250 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామ న్నారు. ముచ్చింతల్‌ ప్రభుత్వ పాఠశాలను తమ ట్రస్టు ద్వారా దేశంలోనే ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని తెలిపారు. డీఈఓ మాట్లా డుతూ.. గతేడాది 78 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల.. జూపల్లి జగపతిరావు ప్రత్యేక చొరవతో 1,160కి చేరిందన్నారు. పాఠశాల ప్రారంభమైన ఒకేరోజు 800 మందిపైగా విద్యార్థులు చేరడం చారిత్రాత్మకమని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 9 మంది ప్రభుత్వ టీచర్లను డిప్యూటేషన్‌పై పంపినట్టు తెలిపారు. ప్రస్తుతం 22 మంది ప్రభుత్వ, ప్రయివేటు టీచర్లతో బోధన జరుగుతుందన్నారు. కపిల్‌దేవ్‌ లాంటి గొప్ప వ్యక్తులతో వేదిక పంచుకోవడం మరపురాని ఘట్టంగా అభివర్ణించారు. ఆయన స్ఫూర్తితో విద్యా ర్థులు ఉన్నత చదువులు చదవాలన్నారు. సైంటిస్ట్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కలలు కనండి-కలలు సహకారం చేసుకోండి’ అన్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల వరకు అదనపు బస్సులు నడుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మణ్‌ నాయక్‌, జీహెచ్‌ఎం ఉమామహేశ్వరి, ఖుషి ఫౌండేషన్‌ ప్రతినిధులు హరీష్‌, గీత, మాజీ సర్పంచులు వి.సుజాత చంద్రయ్య, బీర్ల పెంటయ్య, మాజీ ఉపసర్పంచ్‌ గండు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -