రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ : యాచారంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
బీసీ రిజర్వేషన్‌తోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం
ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలి
షరతులు లేకుండా కేంద్రం పత్తిని కొనుగోలు చేయాలి
ఫార్మాలో ఉన్న భూములపై నిషేధం ఎత్తివేయాలి
బలవంతపు భూసేకరణను ఆపాలి
నవతెలంగాణ-యాచారం
దేశంలో బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని, ఆ విధంగానే అక్రమ పద్ధతుల్లో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్‌లో నిర్వహించిన పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించిందని, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు పదేపదే చెప్పాయని గుర్తు చేశారు. ఆ విధంగానే బీహార్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాజ్యాంగ వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఈసీలను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ప్రజలు చైతన్యమై పోరాడాలని కోరారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల ఆంశంతోనే విజయం సాధించిందని అన్నారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పండించిన పత్తి పంటను షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. పండించిన పత్తి పంటకు మద్దతు ధర లభించేలా అధికారులు దృష్టిపెట్టాలని తెలిపారు. సీసీఐ సెంటర్లను వెంటనే ప్రారంభించి పత్తిని కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ కపాస్ యాప్‌తోనే రైతులకు సమస్యలను తెచ్చిపెట్టిందని అన్నారు.
యాచారం మండల పరిధిలోని ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ధ గ్రామాల్లో నిషేధిత జాబితాలో ఉన్న రైతు పేర్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులందరికీ ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు పొందేలా చూడాలని అన్నారు. మొండిగౌరెల్లి గ్రామ రెవెన్యూకు సంబంధించి 127, 68, 19 సర్వే నెంబర్లలో ఉన్న భూములకు బహిరంగ మార్కెట్ కంటే మూడింతలు ఎక్కువ పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సీపీఐ(ఎం) రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, డి.రామచంద్, కె.భాస్కర్, డి.జగదీష్, ఈ. నర్సింహ, కె. జగన్, చంద్రమోహన్, కవిత, జిల్లా కమిటీ సభ్యులు అలంపల్లి నరసింహ, సీహెచ్ జంగయ్య, రావుల జంగయ్య, అంజయ్య, జగన్, మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శి ప్రజా సంఘాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.



