Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల విధులు విస్మరణ

ఎన్నికల విధులు విస్మరణ

- Advertisement -

కామారెడ్డిలో 53 మంది, నారాయణపేటిలో 74 మందికి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయప్రతినిధి/ మక్తల్‌

పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌(పీవో), ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపీవో) కీలకం. అయితే గ్రామపంచాయతీ తొలి విడుత ఎన్నికల్లో భాగంగా కీలకమైన పోలింగ్‌ రోజు.. పలువురు అధికారులు తమ విధులకు డుమ్మా కొట్టారు. పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహణకు సంబంధించి ఇది వరకు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ర్యాండమైజేషన్‌ చేసి కేంద్రాలకు ప్రిసైడింగ్‌ అధికారులను, ఇతర పోలింగ్‌ అధికారులను కేటాయించారు. వీరంతా 10వ తేదీనే కేటాయించిన సదరు సెంటర్‌లకు వెళ్లి రిపోర్ట్‌ చేయాల్సి ఉంది. కాగా, కామారెడ్డి జిల్లాలో 53 మంది, నారాయణపేట జిల్లాలో 74 మంది.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజయ్యారు. దాంతో వారికి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. వారి స్థానాల్లో ఇతరులను సర్దుబాటు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 53 మంది పీవో/ఓపీవోలు 10వ తేదీన రిపోర్ట్‌ చేయకపోవడం గమనార్హం. దీంతో వారికి కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆశీష్‌ సాంగ్వాన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు నారాయణపేట జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్‌ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -