Saturday, November 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుచర్చలు సఫలం

చర్చలు సఫలం

- Advertisement -

ప్రయివేటు కాలేజీల బంద్‌ విరమణ
నేటినుంచి తరగతులు
రూ.600 కోట్లు విడుదల చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి
నిరసన కార్యక్రమాలు రద్దు : ఫతి చైర్మెన్‌ రమేష్‌బాబు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈనెల మూడో తేదీ నుంచి తలపెట్టిన ప్రయివేటు కాలేజీల బంద్‌ను విరమించాయి. శుక్రవారం హైదరాబాద్‌ లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫతి చైర్మెన్‌ నిమ్మటూరి రమేష్‌బాబు, సెక్రెటరీ జనరల్‌ రవికుమార్‌, కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కె సునీల్‌కుమార్‌ చర్చలు జరిపారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు సంబంధించి రూ.1,500 కోట్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని అడిగారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశామనీ, మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మరో రూ.300 కోట్లు కొద్ది రోజుల్లోనే మంజూరు చేస్తామన్నారు. ఫీజు బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనీ, బంద్‌ను విరమింపజేయాలని కోరారు.

ఫతి చైర్మెన్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ రూ.600 కోట్లు వెంటనే విడుదల చేయడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇవ్వడంతో కాలేజీల బంద్‌ను విరమింపజేయాలని నిర్ణయించామని చెప్పారు. నిరసన కార్యక్రమలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు సంబంధించి ఒక కమిటీని వేయాలని కోరారు. దీనిపై స్పందించిన భట్టి త్వరలోనే ఒక కమిటీని వేసి త్వరితగతిన నివేదిక వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామనీ, ఆ కమిటీలో అధికారులతోపాటు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని అన్నారు. రమేష్‌బాబు మాట్లాడుతూ విద్యాశాఖ ఇన్‌చార్జీ కార్యదర్శి శ్రీదేవసేన లేదా ఇతర అధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో తాము ఒకటి మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు ఆ మాటలను వక్రీకరించాయని అన్నారు. దాన్ని ఖండించామని గుర్తు చేశారు. మూడో తేదీ నుంచి కాలేజీల బంద్‌ వల్ల కొన్ని పరీక్షలను నిర్వహించలేకపోయామనీ, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనీ, అందుకు చింతిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల అధికారులతో సంప్రదించి త్వరగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం అయినందున అధ్యాపకుల ప్రదర్శనను రద్దు చేస్తున్నామని సెక్రెటరీ జనరల్‌ రవికుమార్‌ చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధ్యాపకుల ప్రదర్శన తప్పు అని కోర్టు చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విద్యాకార్యదర్శి శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -