అంగన్‌వాడీల పోరుబాట
కొడంగల్‌లో ఉద్రిక్తంగా మారిన సీఎం ఇంటి ముట్టడి
పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట
పలువురు ఉద్యోగులకు గాయాలు
ఐసీడీఎస్ అధికారులతో నేడు చర్చలకు సమయం
ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్
అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి
నవతెలంగాణ-కొడంగల్/విలేకరులు
నూతన విద్యావిధానాన్ని రద్దుచేయాలని, ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్‌వాడీలకు అప్పగించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని సీఐటీయూ నాయకులతోపాటు అంగన్‌వాడీలు ముట్టడించారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు పరిగి, వికారాబాద్, తాండూర్, నారాయణపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు కొడంగల్‌కు చేరుకున్నారు. అంతకుముందే అప్రమత్తమైన పోలీసులు సీఎం నివాసానికి వెళ్లే రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీలు సీఎం ఇంటికి బయలుదేరగా.. గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట జరిగింది. ప్రతిఘటించిన సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీలు.. సీఎం ఇంటి ప్రధాన గేటు వద్దకు చేరుకుని ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. దాంతో అంగన్‌వాడీలను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా మగ పోలీసులే అంగన్‌వాడీ టీచర్లను, సీఐటీయూ నాయకులను కాళ్లు, చేతులు పట్టి లాక్కేళ్లారు. దాంతో పలువురు గాయపడటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది.
మేం మనుషులం కాదా? : అంగన్‌వాడీలు
తమ ఇక్కట్లను ఏకరువు పెట్టేందుకు వచ్చిన అంగన్‌వాడీలపై పోలీసులు ప్రవర్తించిన తీరు విస్మయం కలిగించింది. ‘మేం మనుషులం కాదా.. మాపై ఎందుకు బల ప్రయోగం చేస్తున్నారు..’ అంటూ అంగన్‌వాడీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం భయపకుండా అంగన్‌వాడీలు ఆందోళన కొనసాగించారు. సుమారు రెండు గంటలకు పైగా ఉద్రిక్తత కొనసాగింది. చివరకు పోలీసులు.. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, నాయకులు నర్సమ్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్యను అరెస్టు చేశారు. జయలక్ష్మి, నర్సమ్మలతో పాటు మరికొంతమందిని యాలాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ నాయకులతోపాటు ఇతర అంగన్‌వాడీలను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి : జయలక్ష్మి
ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్ వాడీలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. మహిళా ఉద్యోగులు తామ గోడు వెళ్లబోసుకున్నా రాష్ట్రప్రభుత్వం పెడచెవిన పెడుతుందని విమర్శించారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదేండ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నా రు, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. తాము ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని, ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని అన్నారు. కొడంగల్‌లో సీఎం ఇంటి ముట్టడితో ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారులతో చర్చలు జరిపేందుకు మంగళవారం సమయం కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి
ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ముందు బైటాయించి నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో మంత్రుల కార్యాలయాల ముట్టడికి బయలుదేరిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. హనుమకొండ జిల్లా రామ్‌నగర్‌లోని సుందరయ్య భవన్ నుంచి అంగన్వాడీలు పెద్ద ఎత్తున ర్యాలీగా మంత్రి సురేఖ ఇంటికి బయలుదేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకుని అరెస్టులు చేశారు. ములుగు జిల్లాలో బస్టాండ్ నుంచి మంత్రి సీతక్క కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న అంగన్వాడీలను మిషన్ భగీరథ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైటాయించారు. మంథని ప్రాంతానికి చెందిన అంగన్‌వాడీలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబుతో ఫోన్‌లో మాట్లాడగా.. ఆయన స్పందించి అంగన్వాడీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మంచిర్యాలలో మంత్రి గడ్డం వివేక్ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంప్ కార్యాలయం ముందు అంగన్‌వాడీలు భారీ ధర్నా నిర్వహించారు. తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇల్లందులో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బైటాయించి నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ, అంగన్‌వాడీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో పాటు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరికొందరు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇంటిని ముట్టడించగా.. వారిని అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇంటిని ముట్టడించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు.