Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఆర్మీ ఆధీనంలోకి నేపాల్ శాంతిభ‌ద్ర‌త‌లు

ఆర్మీ ఆధీనంలోకి నేపాల్ శాంతిభ‌ద్ర‌త‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అవినీతికి, సోషల్‌మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జనరేషన్‌ – జెడ్‌ ఆందోళనకారులు గత రెండు రోజులు నేపాల్‌ దేశవ్యాప్తంగా భారీగా నిరసనలు చేపట్టారు. పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టి తగలబెట్టారు. అలాగే అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి, ప్రధాని భవనాలను చుట్టుముట్టి నిప్పంటించారు. దీంతో నేపాల్‌ అంతా కల్లోలంగా మారింది. ఈ పరిణామాల వల్ల ఆ దేశ ప్రధాని కె. పి శర్మ ఓలితోపాటు హోంశాఖ, వ్యవసాయ శాఖా మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. భయాందోళనలకు గురిచేస్తున్న ఈ పరిస్థితుల నడుమ.. శాంతి భద్రతలను కాపాడడానికి రంగంలోకి దిగుతున్నట్లు నేపాల్‌ ఆర్మీ మంగళవారం రాత్రి ప్రకటించింది. రెండు రోజులుగా నిరసనలు హోరెత్తడంతో.. నేపాల్‌ వీధుల్లోనూ, ప్రధాన కార్యాలయాలు చుట్టూ ఆర్మీ బలగాలు మోహరించాయి. బుధవారం ఆ దేశ రాజధాని ఖాట్మాండ్‌ వీధుల్లో సైనికులు పహారా కాస్తున్నారు. ఈ సందర్భంగా ‘దేశంలో మొదటగా పరిస్థితులని సాధారణ పరిస్థితుల్లోకి తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. ప్రజల జీవితాలు, వారి ఆస్తులకు రక్షణ కల్పించేందుకు మేము కట్టుబడి ఉన్నాము’ అని ఆర్మీ ప్రతినిధి రాజా రామ్‌ బాస్నెట్‌ తెలిపారు.

బుధవారం నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పాడెల్‌ నిరసకారుల ప్రతినిధుల బృందంతోనూ, ఆర్మీతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు వారితో శాంతియుత చర్చలు జరిపే అవకాశం ఉంది.
కాగా, నేపాల్‌ ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆ దేశంలోని భారతీయులను కాపాడేందుకు ముందుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌- నేపాల్‌ సరిహద్దు జిల్లాలో హైఅలర్ట్‌లో ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నేపాల్‌లోని భారతీయుల్ని కాపాడేందుకు ఒక వాట్సాప్‌ నెంబర్‌తోసహా మూడు హెల్ప్‌లైన్‌ నెంబర్లను జారీ చేసింది. 0522-2390257, 0522-2724010, 9454401674 ఈ నెంబర్లను సంప్రదించమని కోరింది. దీనికోసం లక్నోలో పోలీసు ప్రధాకార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ని కూడా ఏర్పాటైంది. మరోవైపు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి కూడా అప్రమత్తమయ్యారు. ఆయన నేపాల్‌ సరిహద్దు జిల్లా అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితిని కనుక్కొన్నారు. సరిహద్దు జిల్లాల్లో నిఘా ఉంచాలని, చెకింగ్‌ క్యాంపెయిన్‌లను ప్రారంభించాలని, సామాజిక వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సిఎం ధామి అధికారులకు ఆదేశించారు. సోషల్‌మీడియా అసత్య ప్రచారాలను అరికట్టడానికి నిరంతరం పర్యవేక్షించాలని నొక్కి చెప్పారు.

భారీ నిరసనల క్రమంలో.. నేపాల్‌లోని భారతీయులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి భారతీయ పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ‘మేము భోపాల్‌ (మధ్యప్రదేశ్‌) నుండి నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయానికి వెళ్లాము. మేము భారత్‌కి తిరిగి రావడానికి విమానం ఎక్కాము. కానీ అది రద్దవ్వడంతో మేము విమానం నుంచి దిగిపోయాము. నేపాల్‌లో పరిస్థితి ఉద్రికత్తంగా ఉంది. మేము మొత్తం 60 మంది. అందరూ సీనియర్‌ సిటిజన్స్‌. దీంతో మేము విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్నాము’ అని ఒక పర్యాటకుడు తెలిపారు. ఇదిలా ఉండగా.. కేవలం పర్యాటకులు మాత్రమే కాదు.. ఖాట్మాండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్‌ – నేపాల్‌కు విమాన రాకపోకల్ని నిలిపివేయడంతో.. దాదాపు 700 మంది భారతీయ ప్రయాణీకులు చిక్కుకుపోయారు. వారంతా విమానాశ్రయంలోనే ఉండిపోయారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad