నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం తో గాజాలో దయనీయ పరిస్థితులు తలెత్తాయి. ఐడీపీ సేనల దాడులతో గాజాలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా గాజాలో ఎలాంటి మానవత సాయం అందకుండా నెతన్యాహు చక్రబంధం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచదేశాల నుంచి పాలస్తీయన్లకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. గాజాకు మద్దతుగా యూరప్ దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించకుంటే ఫ్రాన్స్, కెనడా, ఇంగ్లాండ్ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తామని, సెప్టంబర్ నెలలో జరిగే యూఎన్ అసెంబ్లీ తీర్మానానికి మద్దతుగా ఓటు వేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అరబ్ దేశాలు కూడా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని తెలియజేశాయి. ఈక్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో ములుగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా..సొంత దేశాధికారులు ట్రంప్ కు కీలక లేఖలు రాశారు.
గాజాలో యుద్ధాన్ని ఆపేలా ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఇజ్రాయెల్‌కు చెందిన దాదాపు 600 మంది విశ్రాంత భద్రతా అధికారులు, నిఘా సంస్థల మాజీ అధిపతులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. హమాస్ ఇకపై తమ దేశానికి వ్యూహాత్మక ముప్పు కాదని.. వృత్తిపరమైన అనుభవంతో ఇది చెబుతున్నట్లు పేర్కొన్నారు.