Saturday, September 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనెతన్యాహుకు శృంగభంగం

నెతన్యాహుకు శృంగభంగం

- Advertisement -

యూఎస్‌లో ప్రసంగాన్ని బహిష్కరించిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు
స్పందించకుండా సభలోనే భారత్‌
హమాస్‌ పని పూర్తిచేస్తామంటూ ఇజ్రాయిల్‌ అధ్యక్షుడి హూంకరింపు

న్యూయార్క్‌ : ఐక్య రాజ్య సమితి (యుఎన్‌) సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహు ప్రసంగాన్ని అమెరికా మిత్రపక్షాలుసహా పలు దేశాలు బహిష్కరించాయి. ఆయన మాట్లాడ టం ప్రారంభించగానే పాలస్తీనాకు మద్దతుగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియాతో సహా పలు అరబ్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు నినాదాలు చేసుకుంటూ వాకౌట్‌ చేశాయి. సభలో అమెరికా రాయ బారులు, హంగేరి, చెక్‌ రిపబ్లిక్‌లు ఉన్నాయి. వాటితోపాటు భారత్‌ వాకౌట్‌ చేయకుండా, స్పందించకుండా సభలోనే ఉండటం గమనార్హం. సభలో నెతన్యాహూ మాట్లాడుతూ జాతీయ భద్రత కోసం అంటూ గాజాలో మారణహోమాన్ని సమర్థించుకున్నారు. గాజాలో హమాస్‌ పని పూర్తి చేస్తామని అన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసేవారు, చిన్నపిల్లలను చంపేవారికి మీరు మద్దతు ఇస్తున్నారా అంటూ పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న దేశాలపై నిందలు వేశారు.

ఇజ్రాయిల్‌ భూభాగంలో పాలస్తీనాకు చోటు లేదంటూ నిస్సిగ్గుగా ప్రకటించారు. తమకు అండగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పలుమార్లు పొగిడారు. ఐక్యరాజ్య సమితి కమిషన్‌, అంతర్జాతీయ న్యాయస్థానం, అనేక దేశాలు చేస్తున్న ఆరోపణలను ఖండిం చారు. ఇరాన్‌, ఖతార్‌లపై దాడులతో శత్రువుల ఆస్తులను ద్వంసం చేశామని, గాజాలో తాము అనుకున్నది సాదిస్తామని సమావేశంలో చెప్పుకొచ్చారు. మరోవైపు నెతన్యాహు కార్యాలయం ఇజ్రాయిల్‌ సరిహద్దు వైపు ట్రక్కులపై లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయాలని, అందరూ అధ్యక్షుడి మాటలను వినేలా ఏర్పాట్లు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది.

ప్రపంచ దేశాలు సహాయం చేయాలి : అబ్బాస్‌
మరోవైపు గురువారం పాలస్తీనా నాయకుడు మహమ్మద్‌ అబ్బాస్‌ సర్వసభ్య సమావేశంలో ఆన్‌లైన్‌లో ప్రసంగం చేశారు. అమెరికా వీసా నిరాకరించడంతో ఆయన ఆన్‌లైన్‌లో ప్రసంగించారు.. పాలస్తీనాను గుర్తిస్తున్నామని అనేక దేశాలు ప్రకటించడాన్ని స్వాగతించారు. దేశాన్ని సాధించడానికి మరింత సహాయం చేయాలని కోరారు. పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయడానికి అంతర్జాతీయ సమాజాని ఇదే సమయమని, ఆక్రమణ నుంచి విముక్తి పొందడానికి, చట్టబద్ధ హక్కులను సాధించడానికి ప్రపంచ దేశాలు సహాయం చేయాలి అబ్బాస్‌ కోరారు.

తక్షణం శాంతిని నెలకొల్పండి : ప్రతినిధుల డిమాండ్‌
ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అనేక దేశాల ప్రతినిధులు గాజాలో తక్షణ శాంతి నెలకొనాలని, సాయం పంపాలని డిమాండ్‌ చేశారు. గాజాలో 65 వేల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ సైన్యం చంపిందని, 90% జనాభాను నిరాశ్రయులను చేసిందని, ఆకలి బాధలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్వక్తం చేశారు. 150కు పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. అమెరికాలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరుగుతున్నా ట్రంప్‌ ప్రభుత్వం గుర్తించలేదు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ వెస్ట్‌ బ్యాంక్‌ను ఇజ్రాయిల్‌ స్వాధీనం చేసుకోవడానికి అనుమతించబోమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -