ప్రపంచకప్ సెమీస్‌లో హంపి, దివ్య
బటుమి (జార్జియా) : ఫిడె 2025 మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత్ సరికొత్త సృష్టించింది. ప్రతిష్టాత్మక చదరంగ ప్రపంచకప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. ఫిడె చెస్ ప్రపంచకప్ చరిత్రలో భారత్ నుంచి ఓ క్రీడాకారిణి సెమీఫైనల్‌కు చేరుకోవటం ఇదే ప్రథమం. చైనా జీఎం యుజిన్ సాంగ్‌పై తెలుగు తేజం కోనేరు హంపి 1.5-0.5తో విజయం సాధించింది. దీంతో ఫిడె ప్రపంచకప్ సెమీస్‌కు చేరిన తొలి భారత జీఎంగా హంపి నిలిచింది. సహచర భారత జీఎం, తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికతో క్వార్టర్‌ఫైనల్లో పైచేయి సాధించిన దివ్య దేశ్‌ముఖ్ సైతం సెమీఫైనల్‌కు చేరుకుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి నిరాశపరిచింది. ప్రపంచకప్‌లో టాప్-3లో నిలిచిన గ్రాండ్‌మాస్టర్లు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఫిడె క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించనున్నారు. ప్రపంచకప్‌లో టాప్-4లో ఇద్దరు భారత అమ్మాయిలు ఉండటంతో.. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు కనీసం ఓ బెర్త్ భారత్ ఖాయం చేసుకుంది. ఫైనల్లో చోటు కోసం ఇటు హంపి, అటు దివ్య చైనా గ్రాండ్‌మాస్టర్లతో తలపడనున్నారు.
హింపి చరిత్ర
ఫిడె ప్రపంచకప్ సెమీఫైనల్లో చైనా అమ్మాయి సాంగ్‌తో తొలి గేమ్‌లో హంపి మెరుపు విజయం సాధించింది. 53 ఎత్తుల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. విలువైన ఓ పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. క్లాసికల్ ఫార్మాట్‌లో రెండో గేమ్‌లో 53 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. 1.5-0.5తో స్పష్టమైన ఆధిక్యం సాధించిన హంపి సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్న తొలి భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచింది.
హారిక పోరాడినా..
యువ గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్, తెలుగు తేజం ద్రోణవల్లి హారిక క్వార్టర్‌ఫైనల్లో ఆఖరు వరకు అమీతుమీ పోరాడారు. క్లాసికల్ ఫార్మాట్‌లో తొలి గేమ్ 31 ఎత్తుల్లో, రెండో గేమ్ 60 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. దీంతో విజేతను టైబ్రేకర్‌లో తేల్చాల్సి వచ్చింది. టైబ్రేకర్‌లో తొలుత తెల్ల పావులతో ఆడిన దివ్య దేశ్‌ముఖ్ 57 ఎత్తుల్లో విజయం సాధించింది. రెండో టైబ్రేకర్‌లో నల్ల పావులతో ఎత్తులేసిన దివ్య 76 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. రెండో టైబ్రేకర్‌లో ఆఖరు వరకు విజయం కోసం ప్రయత్నించిన హారిక.. సహచర యువ గ్రాండ్‌మాస్టర్‌కు ప్రపంచకప్ సెమీఫైనల్ బెర్త్ కోల్పోయింది. మరో క్వార్టర్‌ఫైనల్లో చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్‌తో తలపడిన రమేశ్‌బాబు వైశాలి క్లాసికల్ ఫార్మాట్‌లోనే ఆశలు ఆవిరి చేసుకుంది. తొలి గేమ్‌ను 72 ఎత్తుల్లో డ్రా చేసుకున్న వైశాలి.. రెండో గేమ్‌లో నల్ల పావులతో ఎత్తులు వేసింది. 88 ఎత్తుల్లో చైనా గ్రాండ్‌మాస్టర్ విజయం సాధించింది. 0.5-1.5తో వైశాలి సెమీఫైనల్ బెర్త్ చేజార్చుకుంది.
సీఎం అభినందనలు
ఫిడె 2025 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తెలుగు తేజం కోనేరు హంపిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రపంచకప్‌లో ఇదే జోరు కొనసాగించి విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి సోషల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
చదరంగంలో నవ చరిత్ర
- Advertisement -
- Advertisement -