కర్నాటకలోని ఉడిపిలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
గోవాలో రాముడి విగ్రహం ఆవిష్కరణ
ఉడిపి : నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, దేశ పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉగ్ర దాడుల తర్వాత, ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా నిర్లిప్తంగా ఉండేవని విమర్శించారు. ”ఆపరేషన్ సుదర్శన్ చక్ర” దేశానికి ‘భద్రత వలయాన్ని’ అందిస్తుందని, ఎవరైనా శత్రువులు భారత్‌పై దాడికి ప్రయత్నిస్తే, వారిని సర్వనాశనం చేస్తుందని అన్నారు. కర్నాటకలోని ఉడిపిలో జరిగిన లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఈ ఏడాది ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రకటించాం.
రానున్న దశాబ్దకాలంలో భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను ప్రారంభించాము’ అని ఆయన స్పష్టం చేశారు. గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రాముడి విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ పర్యటించిన ప్రధాని మోడీ, విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.



