Saturday, July 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్నూతన రేషన్ కార్డులతో అర్హులకు మేలు: కలెక్టర్

నూతన రేషన్ కార్డులతో అర్హులకు మేలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
నూతన రేషన్ కార్డుల పంపిణీతో అర్హులైన పేద ప్రజలందరికీ మేలు చేకూరిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నూతన రేషన్ కార్డుల జారీతో పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందుతాయని అన్నారు. ముధోల్ నియోజక వర్గానికి సంబంధించి 11 వేల 352 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

17609 మంది కుటుంబ సభ్యుల పేర్ల మార్పు, చేర్పులు జరిగాయని అన్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో రేషన్ కార్డులు లేని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఇక నుంచి ఆ సమస్యలు తీరిపోతాయని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం ఉచితంగా పోషక విలువలు కలిగి పోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని అందిస్తుందన్నారు. గ్రామాల వారిగా అధికారులు ప్రజలందరికీ రేషన్ కార్డులు అందిస్తారని పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఎప్పుడైనా నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు, కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ డీలర్లు ప్రజలకు ప్రతీ నెలా క్రమం తప్పకుండా సమయానికి బియ్యాన్ని అందించాలని సూచించారు. 

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, నూతన రేషన్ కార్డుల పంపిణీ చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఈ ఉచిత బియ్యాన్ని బయట అమ్ముకోకుండా, వినియోగించుకోవాలని కోరారు. చాలా ఏండ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు ఇవ్వడం మంచి విషయం అని పేర్కొన్నారు.

అనంతరం లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి రాజేందర్, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీఓ శివకుమార్, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -