నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో సామాజిక చేకూర్పు – నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు విభిన్న ప్రతిభావంతుల (pwd ) సంఘాలు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటుపైన శిక్షణ కార్యక్రమము కళాభవన్ కామారెడ్డిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ అశిష్ సంఘ్వాన్ హాజరై మాట్లాడారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హాజరైనటువంటి 22 మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, గ్రామ సంఘాల క్లస్టర్ కోఆర్డినేటర్లను మండల సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిగిలిపోయిన సంఘాలలో చేరినటువంటి నాలుగు రకాలు మొదటిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు సంఘాల్లో చేరకుండా మిగిలిపోయిన పేద మహిళలను అందరిని సంఘాలలో చేర్పించాలన్నారు.
అలాగే 60 సంవత్సరాలు నిండిన వృద్ధ మహిళలను వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు వయసు ఉన్న కిశోర బాలికలకు కిషోర్ బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విభిన్న ప్రతిభవంతుల (pwd) సంఘాలు తయారు చేయాలని సూచించారు. కొత్తగా సంఘాలలో చేరడం ద్వారా పొందేటువంటి లబ్ధిని, లాభాలను వారికి తెలియజేసి సంఘాలుగా తయారు చేయాలని దీని ద్వారా వారి ఆర్థిక, సామాజిక జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని అందరి ఏపీఎం లకు సీసీలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ( లోకల్ బాడీ ) చందర్ నాయక్, గ్రామీణ పేదరిక నిర్మూలన డిఆర్డిఓ సురేందర్, అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, డీపీఎం ఐబి, బిఎల్ శ్రీనివాస్, నాన్ ఫార్మ్ డిపిఎం సాయిలు, ఫార్ము డిపిఎం సురేష్, సోషల్ సెక్యూరిటీ డిపిఎం శోభ, ఫైనాన్స్ డిపిఎం రాజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.