నవతెలంగాణ – హైదరాబాద్: న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు. మమ్దానీని కమ్యూనిస్టుగా సంబోధిస్తూ ట్రంప్.. ‘కమ్యూనిస్టు న్యూయార్క్ మేయర్ నన్ను కలవాలని టైమ్ అడిగారు. శుక్రవారం కలుద్దామని చెప్పా. చూద్దాం ఈ సమావేశం ఎలా ఉండబోతోందో’ అంటూ ట్రంప్ పోస్టు పెట్టారు.
మేయర్ ఎన్నికల్లో మమ్దానీ చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విక్టరీ స్పీచ్ లో ట్రంప్ ను ఉద్దేశించి మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాలను మమ్దానీ తప్పుబట్టారు. న్యూయార్క్ వలసదారులతోనే అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. ట్రంప్ ను ఓడించడం కష్టం కాదని తన గెలుపు నిరూపించిందని మమ్దానీ పేర్కొన్నారు. ఇదే న్యూయార్క్ నగరం ట్రంప్ ను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని, ఇక్కడి నుంచే ఆయన ఎదుగుదల ప్రారంభమైందని గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ట్రంప్ పతనం కూడా ఇక్కడి నుంచే మొదలైందని మమ్దానీ వ్యాఖ్యానించారు.



