నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన’ కమిటీ కుర్రోళ్లు’ చిత్రం సైమా 2025లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు నిహారిక కొణిదెలకు ‘బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్’ అవార్డు లభించగా, యువ నటుడు సందీప్ సరోజ్‌కు ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్’ అవార్డు దక్కింది.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్,రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాకతో కలిసి నిహారిక నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సుమారు రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రూ. 18.5 కోట్లు వసూలు చేయగా, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా రూ. 6 కోట్లు రాబట్టి మొత్తంగా రూ. 24.5 కోట్ల కలెక్షన్లను సాధించింది.
గతంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా,దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు లభించాయి. అలాగే, గామా అవార్డుల్లో కూడా బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ (నిహారిక), బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ (యదు వంశీ)గా అవార్డులు అందుకున్నారు.’కమిటీ కుర్రోళ్లు’ సినిమా ఆగస్టు 9, 2024న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించగా, ఎదురురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా,అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.