సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్‌లో ప్రధాన ద్వారం వద్ద నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ గౌరవాధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రిటైర్మెంట్ అయిన ముగ్గురు కార్మికులకు, మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు యూనియన్ నుంచి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న హక్కులను తొలగించి అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మికవర్గం జులై 9న సమ్మె చేసిందన్నారు. హక్కులు సాధించడానికి కార్మికులందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపు ఇచ్చారు.
యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, అధ్యక్షులు ఎం. వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ జీవో ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలను అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలని ఉన్నా 15 ఏండ్లుగా కార్మికులకు సంబంధించిన 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు సవరించకపోవడం అన్యాయమని అన్నారు. నిమ్స్ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు నిమ్స్ హాస్పటల్లో ఉచితంగా వైద్యం అందించాలన్నారు. నూతనంగా పిలిచిన టెండర్లలో కార్మిక వ్యతిరేక క్లాజులను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్ కుమార్ కార్మికులు పాల్గొన్నారు.
నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES