నవతెలంగాణ ఖాట్మాండు: నేపాల్‌లో తొమ్మిది వామపక్ష పార్టీలు విలీనమై కొత్త పార్టీని ప్రకటించాయి. సిపిఎన్ (మావోయిస్టు సెంటర్), సిపిఎన్ (యునిఫైడ్ సోషలిస్ట్) సహా మరో ఏడు పార్టీలు నేపాల్ రాజధాని ఖాట్మాండులో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఈ విలీన ప్రకటన చేశాయి. నేపాలి కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి. మార్చి ఐదవ తేదిన సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం వెలువడటం గమనార్హం. విలీన ప్రకటనకు ముందు తొమ్మిది వామపక్ష పార్టీల ఆధ్వర్వంంలో భారీ ప్రదర్శన జరిగింది. ఐదు కోణాల నక్షత్రాన్ని ఎన్నికల గుర్తుగా స్వీకరిస్తున్నట్లు నూతనంగా ఏర్పాటైన నేపాలి కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.
సిపిఎన్ (మావోయిస్టు సెంటర్) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ ‘ప్రచండ కొత్త పార్టీకి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. సిపిఎన్ (యునిఫైడ్ సోషలిస్ట్) అధినేత మాధవ్ కుమార్ నేపాల్ సహసమన్వయకర్తగా ఉంటారు. మార్క్సిజం, లెనినిజంను సైద్ధాంతిక మార్గదర్శకంగా తీసుకుంటున్నట్లు బహిరంగ సభలో నేతలు తెలిపారు. రానున్న ఆరు నెలల కాలంలో జాతీయ మహాసభ నిర్వహించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని ప్రకటించారు. మావోయిస్టు సెంటర్, యునిఫైడ్ సోషలిస్ట్ పార్టీలతో పాటు నేపాల్ సమాజవాది, సిసిఎన్ (సోషలిస్ట్), జనసమాజవాది పార్టీ నేపాల్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ, సిపిఎన్ (మావోయిస్టు సోషలిస్ట్) సిపిఎన్ సమబాది, దేశభక్త సమాజవాది మోర్చా పార్టీలు ఈ విలీన ప్రకటన చేశాయి.



