Tuesday, July 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎవరితోనూ పొత్తుండదు

ఎవరితోనూ పొత్తుండదు

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్డీలేని రుణాలిచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా :మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌కు ఏ పార్టీతోనూ పొత్తుండబోదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…ఇప్పటికిప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ వంద సీట్లతో అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కచ్చితంగా మళ్లీ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ.21 వేల కోట్లను పంపిణీ చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెబుతున్నారనీ, అలా చేసినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే.. దాని నిర్మాణాన్ని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలకు నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవటం ద్వారా బనకచర్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తోందని వాపోయారు. ఇలాంటి చర్యలను మానుకోకపోతే ఇప్పుడు వేధిస్తున్న వాళ్ల పేర్లను ‘రెడ్‌ బుక్‌’లో రాసుకుంటామని హెచ్చరించారు. రాబోయేది తమ ప్రభుత్వమేననీ, అందువల్ల పోలీసు, ఇతర అధికారులు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో అందాల పోటీలను నిర్వహించటం ద్వారా రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ గౌరవాన్ని మంటగలిపిందని విమర్శించారు. సీఎం రేవంత్‌కు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్‌ చైర్మెన్‌ మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనే వార్తలొస్తున్నాయని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. వారిపై కాంగ్రెస్‌ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. సంబంధిత సీసీ ఫుటేజీని వెంటనే పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ అంశాలపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఆయన సచివాలయంలోనే ఆ రివ్యూలు చేయొచ్చుగదా? అని ప్రశ్నించారు. సెక్రెటేరియట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టినందుకే అక్కడికి రావటం లేదా? అని నిలదీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -