Monday, September 15, 2025
E-PAPER
Homeజాతీయంఇజ్రాయిల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం వద్దు

ఇజ్రాయిల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం వద్దు

- Advertisement -

కేంద్రాన్ని కోరిన హక్కుల గ్రూపులు

న్యూఢిల్లీ : ఇటీవల కుదిరిన భారత్‌-ఇజ్రాయిల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని (బిట్‌) వంద హక్కుల సంఘాలు, పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమానికి భారత్‌ సహకరిస్తోందనడానికి ఇది స్పష్టమైన సంకేతమని విమర్శించారు. ఒప్పందం నుంచి వైదొలగాలని, ఇజ్రాయిల్‌తో అన్ని రకాల రక్షణ సహకారాన్ని, ఆయుధ వాణిజ్యాన్ని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇజ్రాయిల్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం పెట్టుబడులను పెంచుతుందని, మదుపుదారులకు రక్షణ కల్పిస్తుందని, వాణిజ్యాన్ని వృద్ధి చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ ఒప్పందంపై ఈ నెల 8వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇజ్రాయిల్‌ ఆర్థిక మంత్రి బెజలెల్‌ స్మాట్రిచ్‌ సంతకాలు చేశారు. అయితే ఇజ్రాయిల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడమంటే పాలస్తీనియన్లపై ఆ దేశం సాగిస్తున్న దాష్టీకాలను సమర్ధించడమే అవుతుందని హక్కుల గ్రూపులు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశాయి. దీనిపై ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌, పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిటర్టీస్‌, సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అకౌంటబులిటీ, సీపీఐ (ఎంఎల్‌)తో పాటు పలువురు హక్కుల కార్యకర్తలు, రిసెర్చ్‌ స్కాలర్లు, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని, వాటికి వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా హక్కులను దీర్ఘకాలంగా నిరాకరిస్తున్న ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడమేమిటని వారు నిలదీశారు. ‘గాజా ఇప్పుడు శిథిలాలుగా మారిపోయింది. అందులోని వారు…ముఖ్యంగా చిన్నారులు ఆకలితో అల్లాడిపోతున్నారు. వైద్య సాయం కూడా అందడం లేదు. మరోవైపు వెస్ట్‌బ్యాంక్‌లో ఆక్రమణలు, దాడులు అడ్డూ అదుపూ లేకుండా జరిగిపోతున్నాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలు…ముఖ్యంగా రక్షణ సహకారాన్ని పాలస్తీనాపై ఆ దేశం సాగిస్తున్న దాడుల నుంచి వేరు చూసి చూడలేము. అమెరికా కూడా ఇజ్రాయిల్‌ సైనిక ఆధిపత్యాన్ని తన బేషరతు రాజకీయ, ఆర్థిక, సైనిక మద్దతు ద్వారా వెనకేసుకొస్తోంది’ అని కేంద్రానికి రాసిన లేఖలో హక్కుల సంఘాలు, నేతలు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తప్పుపట్టారు. ఇది యుద్ధానికి సమయం కాదంటూ అంతర్జాతీయ వేదికలపై ప్రధాని సుద్దులు చెబుతున్నారని, ఆయన ప్రభుత్వమేమో ఆక్రమిత ప్రజలపై యుద్ధం ప్రకటిస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -