లోక్‌సభలో ప్రయివేటు బిల్లు
న్యూఢిల్లీ : ఆఫీసు పనివేళలు దాటిన తర్వాత ఉద్యోగులకు ఫోన్ కాల్స్ చేయడం, ఈ మెయిల్స్ పంపడం వంటి పనులు చేయకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన ప్రయివేటు బిల్లును శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏ అంశం పైన అయినా ప్రభుత్వ చట్టం అవసరమని భావించే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎవరైనా ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టవచ్చు. అయితే ప్రతిపాదిత చట్టంపై ప్రభుత్వం స్పందించిన తర్వాత అలాంటి బిల్లులను చాలా వరకూ ఉపసంహరించుకుంటారు. తాజాగా ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ సంస్థను ఏర్పాటు చేయాలని ఆమె ఆ బిల్లులో కోరారు. ఆఫీసు పనివేళలు ముగిసిన తర్వాత, సెలవు దినాలలో పనికి సంబంధించిన కాల్స్, ఈ మెయిల్స్‌కు ఉద్యోగులు స్పందించనక్కరలేదని ఈ బిల్లు చెబుతోంది.
ఇదే తరహా బిల్లును ఆస్ట్రేలియా గత సంవత్సరం ఆమోదించింది. మన దేశంలో కూడా పనిని, కుటుంబ జీవితాన్ని సమతూకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పలు సంస్థలు సూచిస్తున్నాయి. పూనేకు చెందిన 26 సంవత్సరాల యువ ఉద్యోగిఅన్నా సెబాస్టియన్ పెరయిల్ గత సంవత్సరం జూలైలో తీవ్రమైన పని ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆస్ట్రేలియాలో గత ఏడాది ఆమోదించిన చట్టం ప్రకారం పనిగంటలు ముగిసిన తర్వాత ఉద్యోగులు కాల్స్, ఈ మెయిల్స్‌ను నిరాకరించవచ్చు.
సర్వేలో ఏం తేలిందంటే…
మన దేశంలో కూడా ఈ విధానాన్ని అవలంబించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. గత సంవత్సరం గ్లోబల్ జాబ్ వేదిక నిర్వహించిన సర్వేలో దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. 79 శాతం మంది ఉద్యోగులు ఈ చర్యకు మద్దతు తెలిపారు. పనివేళలు ముగిసిన తర్వాత కూడా తమకు తరచూ పనికి సంబంధించిన కాల్స్ వస్తున్నాయని 88 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. ఆరోగ్య కారణాలతో సెలవులో ఉన్నప్పుడు, సెలవు దినాలలో సైతం మెసేజ్‌లు వస్తాయని 85 శాతం మంది అన్నారు. ఒకవేళ ఆ కాల్స్‌ను పట్టించుకోని పక్షంలో తమ కెరీర్ అవకాశాలు, భవిష్యత్తులో ప్రమోషన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని 79 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
పనిగంటలు ముగిసిన తర్వాత నో కాల్స్..ఈ మెయిల్స్
- Advertisement -
- Advertisement -



