Monday, December 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనిర్బంధ సైనిక సేవ వద్దు

నిర్బంధ సైనిక సేవ వద్దు

- Advertisement -

జర్మనీలో వెల్లువెత్తిన జనాగ్రహం
పలు నగరాల్లో భారీ ర్యాలీలు
బెర్లిన్‌ :
దేశ సైనిక సర్వీసులను ప్రక్షాళన చేయాలన్న ఛాన్సలర్‌ ఫ్రెడ్జిచ్‌ మెర్జ్‌ యోచనను నిరసిస్తూ జర్మనీలోని పలు నగరాలలో వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. బలవంతపు సైనిక సమీకరణకు ప్రభుత్వం పునాది వేస్తోందని నిరసనకారులు ఆరోపించారు. మిలిటరీ సర్వీసుల చట్టంలో మార్పులు చేసేందుకు జర్మనీ పార్లమెంట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. సైనిక నియామకా లను పెంచేందుకు, ఒకవేళ వాలంటీర్ల సంఖ్య తగ్గిన పక్షంలో యువతను నిర్బందంగా సైన్యం లో చేర్చుకునేందుకు ఈ చట్ట సవరణలు వీలు కల్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ బెర్లిన్‌, హాంబర్గ్‌, మ్యూనిచ్‌, కొలోగ్న్‌ సహా జర్మనీలోని సుమారు 90 నగరాలలో భారీ ర్యాలీలు జరిగాయి. ప్రదర్శకులు యుద్ధ వ్యతిరేక నినాదాలు చేస్తూ ‘నిర్బంధ సైన్యానికి నో’, ‘మేము ఫిరంగి దళంలో చేరం’, ‘మేము లేకుండానే యుద్ధం చేయండి’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రద ర్శించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల్ని వారు ‘మరణ నియామకాలు’గా అభివర్ణించారు. ఆయుధాలకు బదులు విద్యను, సంక్షేమాన్ని అందించాలని కోరారు. ప్రదర్శనలో భాగస్వామి అయిన ఓ మహిళ విలేకరులతో మాట్లాడుతూ తన ఇద్దరు టీనేజ్‌ కుమారులను బలవంతంగా సైన్యంలోకి లాగుతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా తన ప్రాణాలను తీసుకో వాలని ఆమె వేడుకున్నారు. సైనిక బలగాలను పెంచుకొని రష్యాపై యుద్ధానికి జర్మనీ సమా యత్తమవుతోందని నిరసనకారులు అనుమా నాలు వ్యక్తంచేశారు. ఈ చట్ట సవరణతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని, ఇది ఆయుధ కంపెనీలకే ప్రయోజనకరమని వారు తెలిపారు.

ఏం జరిగిందంటే…
నిర్బంధ సైనిక సేవను జర్మనీ 2011లో రద్దు చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా సైన్యంలో చేరవచ్చునని తెలిపింది. అయితే దేశంలో భద్రతాపరమైన వాతావరణం క్షీణించిందని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు సైన్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. అటు నాటో కూడా తన సభ్య దేశాలకు సైనిక నియామకాలు జరపాలని సూచించింది. నాటో సభ్యదేశం పైకి రష్యా 2028లో దాడి చేయవచ్చునని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ గత నెలలో అనుమానం వ్యక్తం చేశారు. కాగా తాజాగా చట్టంలో చేసిన సవరణల ప్రకారం…18 సంవత్సరాలు దాటిన యువకులందరూ వచ్చే సంవత్సరం నుంచి ప్రశ్నావళిని పూర్తి చేసి, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా వారు స్వచ్ఛందంగా సైన్యంలో చేరేందుకు అంగీకరించాలన్న మాట. గతంలో రద్దు చేసిన నిర్బంధ సైనిక శిక్షణను తిరిగి ఉనికిలోకి తీసుకొని రావడం, ఒకవేళ స్వచ్ఛంద నియమకాలు తగ్గితే బలవంతంగానైనా యువతను సైన్యంలో చేర్చడం ఈ సంస్కరణల ఉద్దేశమని ప్రజలు మండిపడుతున్నారు.

‘నో’ అంటున్న యువత
ప్రజాదరణ లేని చర్యలను బలవంతంగా రుద్దడానికి, పెద్ద మొత్తంలో పెట్టే సైనిక వ్యయాన్ని సమర్ధించుకోవడానికి బెర్లిన్‌ కుంటిసాకులు చెబుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ జర్మన్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 18-29 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 63 శాతం మంది తప్పనిసరి సైనిక సేవను వ్యతిరేకిస్తున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వే తేల్చింది.

అర్థంలేని అనుమానాలు : రష్యా
నాటోపై దాడి చేయాలని తాను అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రష్యా తోసిపుచ్చింది. దీన్ని అర్థం లేని వాదనగా, అనుమానంగా కొట్టివేసింది. సైనిక బడ్జెట్‌ను పెంచడానికి దీనిని ఓ సాకుగా చూపుతున్నారని, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ ఎత్తుగడ పన్నారని విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -