Wednesday, November 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనో ఫార్మర్‌..నో ఫుడ్‌

నో ఫార్మర్‌..నో ఫుడ్‌

- Advertisement -

అగ్రిజోన్ల పేరిట అరాచకాలను అరికట్టాలి
కాప్‌30 వాతావరణ సదస్సు వెలుపల నిరసనలు
కార్పొరేట్‌ సంస్థలైన నెస్లే, బేయర్‌ల పర్యావరణ విధ్వంసం
బెలెమ్‌ (బెల్జియం) : బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న కాప్‌30 వాతావరణ సదస్సు నిరసనలతో మార్మోగింది. సదస్సు జరుగుతున్న ప్రాంగణం వెలుపల వందలాది మంది వాతావరణ కార్యకర్తలు తెల్లని వస్త్రాలు కప్పుకొని పడుకొని తమ నిరసన తెలియజేశారు. భూమి కోసం, సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, పాత్రికేయుల ఉదంతాలను ప్రపంచ నేతల దృష్టికి తెచ్చేందుకు వారు ప్రయత్నించారు. కాప్‌ సదస్సు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ‘అగ్రిజోన్‌’ వద్ద కూడా వాతావరణ కార్యకర్తలు వ్యవసాయ లాబీయిస్టులతో వాగ్వివాదానికి దిగారు. అగ్రి బిజినెస్‌ ప్రయోజనాల కోసం పనిచేసేందుకు ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలైన నెస్లే, బేయర్‌లు ‘అగ్రిజోన్‌’ను స్పాన్సర్‌ చేస్తున్నాయి. వాతావరణ మార్పులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఏర్పడిన ఏకైన ప్రపంచ వేదిక కాప్‌లో తాజాగా అగ్రిజోన్‌ చేరింది. అయితే దీనిలో కాలుష్య కారక సంస్థలు, వ్యాపార వర్గాలదే పైచేయి. వాస్తవానికి ఇటీవలి సంవత్సరాలలో వాతావరణ సదస్సులలో పరిశ్రమ లాబీయిస్టుల ప్రభావం అధికంగా ఉంటోంది. కాప్‌26 తర్వాత ఐదు వేల మందికి పైగా శిలాజ ఇంధన లాబీయిస్టులు రంగంలోకి దిగారు. కాగా వాతావరణ మార్పులపై ఇకనైనా ప్రపంచ నేతలు మేల్కొనాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులకు ఎదుర్కొనేందుకు నిధులు అందజేయాలని, వాతావరణ మార్పుల పై జరుగుతున్న పోరాటంలో రాజకీయ నాయకులు భాగస్వాములు కావాలని, వాతావరణ సంక్షోభం కారణంగా నష్టపోయిన సమాజాలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్‌ చేస్తూ యువ ఆఫ్రికా కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. వాతావరణ మార్పులపై బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా ఇచ్చిన హామీలు నెరవేరతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పలువురు నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అవేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. ఇకపై కొత్త హామీలు అవసరం లేదని, గతంలో ఇచ్చినవి నెరవేరిస్తే చాలునని పలువురు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -